ఆర్‌బీఐ డివిడెండ్‌ బొనాంజా | RBI approves Rs 2,86588 crore dividend to Center government | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ డివిడెండ్‌ బొనాంజా

May 23 2026 12:44 AM | Updated on May 23 2026 6:10 AM

RBI approves Rs 2,86588 crore dividend to Center government

 2025–26 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్లు 

2024–25 కంటే 6.7 శాతం అధికం 

క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఊరట

ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ద్రవ్య ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న కేంద్ర సర్కారుకు ఆర్‌బీఐ తీపి కబురు చెప్పింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) రికార్డు స్థాయిలో భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ను అందించగా, 2025–26 సంవత్సరానికి 6.7 శాతం పెంచి రూ.2,86,588 కోట్లను ఇవ్వనుంది. 

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో సరఫరాలకు ఆటంకాలు ఏర్పడి, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారంగా మారి, రూపాయి బలహీనపడిన తరుణంలో ఆర్‌బీఐ డివిడెండ్‌ ప్రభుత్వానికి ఊరటనివ్వనుంది. ఏటా ఆర్‌బీఐ తన మిగులు నిల్వల నుంచి ప్రభుత్వానికి డివిడెండ్‌ను ప్రకటిస్తుండడం తెలిసిందే. బడ్జెలో కేంద్ర సర్కారు పేర్కొన్న పన్నేతర ఆదాయం లక్ష్యంలో ఒక్క ఆర్‌బీఐ డివిడెండే ఈ ఏడాది 91 శాతంగా ఉండనుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను, రిస్క్ లను విశ్లేషించిన అనంతరం ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు డివిడెండ్‌పై నిర్ణయం తీసుకున్నారు.  

రూ.91.97 లక్షల కోట్లకు బ్యాలెన్స్‌ షీట్‌: రిస్క్ లకు, చట్టబద్ధమైన ఖాతాలకు కేటాయింపులు చేయడానికి ముందు ఆర్‌బీఐ నికర ఆదాయం 2025–26లో రూ.3.96 లక్షల కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3.13 లక్షల కోట్లుగా ఉంది. బ్యాలెన్స్‌ షీటు 20.61% పెరిగి రూ.91,97,121 కోట్లకు చేరింది. 

‘ఆకస్మిక రిస్క్‌లను ఎదుర్కొనే నిధి’ (సీఆర్‌బీ) కోసం బ్యాలెన్స్‌ షీటులో 4.5–7.5% మధ్య కేటాయింపులు నిర్వహించేందుకు సవరించిన ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌ వీలు కల్పిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో 2024–25లో సీఆర్‌బీకి 7.5%గా ఉన్న కేటాయింపులు 2025–26లో 6.5%కి  తగ్గాయి. ఆర్‌బీఐ ప్రకటించిన రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్‌ ఈ ఏడాది ప్రభుత్వానికి ఊరటనిస్తుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా ప్రస్తుత సవాళ్లను ఇది పూర్తిగా భర్తీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement