
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ.10,987 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.10,461 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ.2,10,910 కోట్ల నుంచి రూ.2,22,864 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో తొలి ఏడాది ప్రీమియం రూ.7,470 కోట్ల నుంచి రూ. 7,525 కో ట్లకు బలపడింది. రెన్యువల్ ప్రీమియం ఆదాయం రూ.56,429 కోట్ల నుంచి రూ.59,885 కోట్లకు ఎగసింది. పెట్టుబడుల నుంచి నికర ఆదాయం రూ.96,183 కోట్ల నుంచి రూ. 1,02,930 కోట్లకు బలపడింది.
మొత్తం ప్రీమియం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 1,19,200 కోట్లకు చేరింది. వ్యక్తిగత విభాగంలో 15 శాతం తక్కువగా 30,39,709 పాలసీలను విక్రయించింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 6 శాతం మెరుగుపడి రూ. 57,05,341 కోట్లుగా నమోదైంది.