
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సీఎక్స్ ను కొనుగోలు చేస్తోంది. ఈ రంగంలో ఇది అత్యంత భారీ ఒప్పందంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక ప్రకారం.. ఈ డీల్ విలువ 1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 5,400 కోట్లు).
రాయిటర్స్ కథనం ప్రకారం.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బీజీహెచ్ క్యాపిటల్ సైబర్ సీఎక్స్ ను విక్రయిస్తోంది. అయితే ఈ ఒప్పందంలోని ఆర్థిక నిబంధనలు మాత్రం వెల్లడి కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, హెల్త్ కేర్ నుంచి ఫైనాన్స్ వరకు కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించే, సున్నితమైన డేటాతో రాజీపడే అధునాతన బెదిరింపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
బీజీహెచ్ క్యాపిటల్ మద్దతుతో 12 చిన్న సైబర్ సెక్యూరిటీ సంస్థల విలీనం ద్వారా మెల్బోర్న్‌కు చెందిన సైబర్ సీఎక్స్ 2019లో ఏర్పడింది. ఈ సంస్థ ప్రస్తుతం 1,400 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా భద్రతా కార్యకలాపాల కేంద్రాలను నిర్వహిస్తుంది. లండన్, న్యూయార్క్ లలో కార్యాలయాలు ఉన్నాయి.
యాక్సెంచర్ 2015 నుండి ఇలాంటి 20 భద్రతా కొనుగోళ్లను పూర్తి చేసింది. వీటిలో బ్రెజిల్ సైబర్ డిఫెన్స్ సంస్థ మార్ఫస్, ఎంఎన్ఈఎమ్ఓ మెక్సికో, స్పెయిన్‌కు చెందిన ఇన్నోటెక్ సెక్యూరిటీ వంటివి ఇటీవల కొనుగోలు చేసిన సంస్థలు.