1,600 శాటిలైట్ల ఎల్‌ఈఓ ప్రాజెక్ట్‌కు ‘ఇన్-స్పేస్’ ఆమోదం
భారత టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇప్పుడు అంతరిక్ష ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌ను శాసించేందుకు ముందడుగు వేసింది. దేశీయంగా సుమారు 1,600 లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ) ఉపగ్రహాలను ప్రయోగించాలనే జియో ప్రతిపాదనకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్-స్పేస్’ (IN-SPACe) సాంకేతిక ఆమోదం తెలిపింది. ఇస్రో, టెలికాం శాఖకు చెందిన వైర్‌లెస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూపీసీ) వింగ్‌లతో కలిసి నిర్వహించిన సమగ్ర పరిశీలన అనంతరం ఈ ప్రాజెక్ట్ సాంకేతికంగా పటిష్టమైనదని స్పష్టం చేసింది. ఇది అంతర్జాతీయంగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ వ్యవస్థతో సమానమైన సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
భారత్‌కు తొలి సొంత శాటిలైట్ నెట్‌వర్క్
ఈ సాంకేతిక అనుమతితో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వద్ద ఆర్బిటల్ స్లాట్లు, స్పెక్ట్రమ్ హక్కులను సాధించేందుకు జియోకు కేంద్ర ప్రభుత్వం తరఫున అంతర్జాతీయ స్థాయి విధానపరమైన మద్దతు లభించనుంది. ఫలితంగా భారతదేశపు మొట్టమొదటి ‘స్వదేశీ శాటిలైట్ కాన్‌స్టలేషన్’ (ఉపగ్రహాల సమూహం) ఏర్పాటుకు మార్గం సుగమంకానుంది.
జియో ప్రతిపాదించిన ఈ నెట్‌వర్క్ భారతదేశంపై సెకనుకు 4.5 నుంచి 5 టెరాబిట్ల డేటా సామర్థ్యాన్ని అందించగలదని అంచనా. ప్రస్తుతం భారత్‌లో అనుమతులు పొందిన స్టార్‌లింక్ (600 జీబీపీఎస్), అమెజాన్ లీఓ (3 టీబీపీఎస్ - ఇంకా ఇన్-స్పేస్ అనుమతి రాలేదు)లతో పోలిస్తే జియో సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 20-22 గ్రౌండ్ స్టేషన్లను జియో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా మారుమూల ప్రాంతాలు, సరిహద్దు కొండ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ చేరడంతోపాటు మొబైల్ ఫోన్లకు నేరుగా కనెక్ట్ అయ్యే ‘డైరెక్ట్-టు-డివైస్’ (డీ2డీ) సేవలు అందుబాటులోకి వస్తాయి.
వ్యూహాత్మక రక్షణ రంగానికి బూస్ట్
ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఉపగ్రహ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఈ స్వదేశీ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కానుంది. జాతీయ భద్రత, వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం ఈ జియో శాటిలైట్లలో కొన్నింటిపై భారత రక్షణ రంగానికి చెందిన పేలోడ్‌లను కూడా అమర్చే అంశంపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ప్రాథమిక చర్చలు జరుపుతోందని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. భవిష్యత్తులో రాబోయే ఇతర భారతీయ ఉపగ్రహ నెట్‌వర్క్‌లతో కలిసి పనిచేసేలా దీని ఆర్కిటెక్చర్‌ను రూపొందించడం విశేషం. సుమారు 10-15 బిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్ట్ మరో 2-3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో దిగొచ్చిన బంగారం ధర!


