
20,000 గదులు
ఐటీసీ హోటల్స్ చైర్మన్ సంజీవ్ పురి
న్యూఢిల్లీ: ఐటీసీ హోటల్స్ 2030 నాటికి నిర్వహణలోని హోటళ్ల సంఖ్యను 220కి పెంచుకోనుంది. అప్పటికి 20వేల కీలను (గదులు) కలిగి ఉంటామని సంస్థ చైర్మన్ సంజీవ్ పురి ప్రకటించారు. ఐటీసీ నుంచి వేరుపడి లిస్టింగ్ అనంతరం జరిగిన తొలి ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి అంతర్జాతీయ అల్లకల్లోల పరిస్థితుల్లో ఆవిష్కరణలు, టెక్నాలజీలపై పెట్టుబడులకు పిలుపునిచ్చారు.
తద్వారా మరింత బలోపేతం కావాలని, స్వావలంబన సాధించాలని పేర్కొన్నారు. యువ జనాభా అధికంగా ఉండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వేగవంతమైన పట్టణీకరణ, టెక్నాలజీ సామర్థ్యాలు, పోటీతత్వం అన్నవి కంపెనీని నిలదొక్కుకునేలా చేస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు 2.2 హోటల్ గదులు అందుబాటులో ఉంటే, భారత్‌లో 0.3 గదులుగానే ఉన్నట్టు పురి చెప్పారు.
అస్సెట్ రైట్ విధానంతో కంపెనీ వేగంగా వృద్ధిని సాధించగలదని చెప్పారు. టైర్ 2, 3 పట్టణాలకు ఐటీసీ హోటల్స్ విస్తరిస్తున్నట్టు చెప్పారు. కస్టమర్లకు మెరుగైన అనుభవంతోపాటు నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలుగా డిజిటల్ టెక్నాలజీలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరాలో ఐటీసీ హోటల్స్ రూ.3,300 కోట్ల ఆదాయాన్ని సాధించిందని, ఎబిట్డా మార్జిన్ 36 శాతానికి పెరిగినట్టు చెప్పారు.