
బిగ్ బ్రదర్ అనే షో పేరు ఇప్పుడు ఎంత మందికి గుర్తు ఉంటుందో కానీ బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టికి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. అప్పటి దాకా పడుతూ లేస్తూ వచ్చిన ఆమె సినీ కెరీర్‌ను ఆ ఇంటర్నేషనల్ షో ఒక్క చేత్తో ఆకాశానికి ఎత్తేసింది మరి. మరోచేత్తో మన మన దేశంలో జాతీయ స్థాయిలోనూ, పలు ప్రాంతీయ భాషల్లోకి సైతం బిగ్ బాస్ షోలను తెచ్చేసింది.
ఆ క్రేజ్ తో కొంత కాలం పాటు సినిమాలను ఒక ఊపు ఊపిన శిల్పాశెట్టి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తెలివిడి బాగా కలిగిన సెలబ్రిటీ. అందుకే సినిమా గ్లామర్‌ని పాప్యులారిటీని బాగానే ఉపయోగించుకుంటూ విభిన్న రంగాల్లోకి ప్రవేశించింది. యోగా వీడియోలు, క్రీడా ఫ్రాంఛైజీలు, రెస్టారెంట్లు ఇలా కాదేదీ సంపాదనకు అనర్హం అన్నట్టుగా ఆమె దూసుకుపోతోంది. బహుశా బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఇన్ని వ్యాపారాల్లో రాణిస్తున్న మరొక నటి లేదని చెప్పొచ్చు. అదే క్రమంలో భర్తతో కలిసి స్కామ్స్‌లో ఇరుక్కోవడం, పోలీసు కేసుల్ని ఎదుర్కోవడం అయినా చలించకుండా ముందుకే అడుగేయడం కూడా ఆమెకు మాత్రమే సాధ్యమైంది.
ఈ నేపధ్యంలో తాజాగా శిల్పాశెట్టి తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. గోవాలో బాస్టియన్ కొత్త అవుట్‌లెట్‌ను శిల్పా శెట్టి ఏర్పాటు చేస్తోంది. ఈ విజయవంతమైన వ్యాపారవేత్త కూడా అయిన ’సుఖీ’ నటి గోవాలోని తన ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్ బాస్టియన్ కొత్త అవుట్‌లెట్ కోసం గత శుక్రవారం ప్రారంభోత్సవ పూజ నిర్వహించింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలోని స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. పూజ సందర్భంగా తెల్లటి ముద్రిత సల్వార్ కమీజ్ ధరించిన ఈ ’ధడ్కన్’ నటి ఓ యజ్ఞం చేస్తున్నట్లు కనిపించింది.
ఇప్పటికే ముంబైలోని జుహులో బాస్టియన్ పేరిట ఒక రెస్టారెంట్‌ను ఆమె విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ రెస్టారెంట్ గత కొంత కాలంగా విజయవంతంగా నడుస్తోంది. ఇది వారం రోజుల్లోనే ఏకంగా రూ.2 నుంచి రూ.3కోట్ల ఆదాయం అర్జిస్తుందని అంటూ గతంలో సెలబ్రిటీల వ్యాపారాలపై మాట్లాడిన సందర్భంగా ప్రముఖ రచయిత్రి కాలమిస్ట్ శోభాడే వెల్లడించారు. అయితే అనూహ్యంగా గత సెప్టెంబర్‌లో, ముంబై, బాస్టియన్‌లోని శిల్పా ఐకానిక్ బాంద్రా రెస్టారెంట్ మూసివేయనున్నట్టు కొన్ని ఊహాగానాలు వచ్చాయి. తరువాత వారు బాస్టియన్ ను అమ్మకై అనే దక్షిణ భారత రెస్టారెంట్‌గా మారుస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత శిల్ప సోషల్ మీడియా ద్వారా ‘లేదు, నేను బాస్టియన్‌ను మూసివేయడం లేదని హామీ ఇస్తున్నాను.‘ అంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు గోవాకు సైతం తమ రెస్టారెంట్‌ను విస్తరించడం ద్వారా అన్ని ఊహాగానాలకూ ఆమె చెక్ పెట్టింది.