
వార్ 2 సినిమా (War 2 Movie)తో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14న విడుదలైంది. మూవీకి పెద్దగా బజ్ లేని సమయంలో నిర్మాత నాగవంశీ (Naga Vamsi)ఇచ్చిన స్పీచ్ బాగా వైరలైంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మూవీ చూశాక ఏమాత్రం అసంతృప్తిగా అనిపించినా పదింతలు తిట్టండి. ఒకవేళ ఇది మీకు అద్భుతమైన సినిమా అన్న ఫీలింగ్ రాకపోతే ఇంకెప్పుడూ నేను మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను.
ఆస్తులమ్ముకుని దుబాయ్‌కు..
తొలిరోజు హిందీ నెట్ వసూళ్లకంటే ఇక్కడ ఒక్క రూపాయి అయినా ఎక్కువరావాలి. తారక్ అన్న ఇండియాలో కాలర్ ఎగరేసేలా చేయాలి అని హైప్ ఇచ్చాడు. కట్ చేస్తే సినిమా దారుణంగా ఫెయిలవడంతో నాగవంశీపై ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఈ సినిమా రిజల్ట్ గురించి నాగవంశీ తొలిసారి స్పందించాడు. మాస్ జాతర మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆగస్టులో ఓ మీడియా నన్ను ఆడేసుకుంది. ఆస్తులమ్ముకుని దుబాయ్ వెళ్లిపోయానన్నారు. నాకర్థం కాని విషయమేంటంటే.. ఆస్తులమ్ముకునేంత దుస్థితిలో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తాం? దుబాయ్ ఏమైనా పల్లెటూరా?
తప్పు జరిగింది
ఇకపోతే ఆరోజు(వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో) బాగా ఎగ్జయిట్ అయ్యాను. తప్పు జరిగింది.. తప్పులు చేయకుండా ఉంటామా? నేను, ఎన్టీఆర్.. ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌ను నమ్మాం. అందరూ తప్పులు చేస్తారు. వాళ్లు తప్పు చేస్తే మేము దొరికామంతే! అది నేను తీసిన సినిమా కాదు. ఆయన ఇండియాలోనే పెద్ద నిర్మాత. ఆయన్ను నమ్మాం.. మిస్‌ఫైర్ అయింది. దానికేం చేయగలం? ట్రోల్ చేశారు.. పడ్డాం. మనం తీసిన సినిమాకు కాకుండా బయట సినిమాకు దొరికినందుకు హ్యాపీ అన్నాడు.
మాస్ జాతర
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్‌లైన్. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం కావడం విశేషం! భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది.