రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా నటించిన థామా (Thamma) మొదటిరోజే భారీ కలెక్షన్స్ రాబట్టింది. హారర్ కామెడీ ఫిల్మ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక హారర్ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ థామాను తెరకెక్కించింది. అయితే, ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. కానీ దీపావళి పండుగ కారణంగా బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించగలిగింది.
బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రకటించే సక్నిల్క్ ప్రకారం.. థామా చిత్రం సుమారు రూ. 34 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది చాలా మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు. ఆయుష్మాన్ కెరీర్లో ఇప్పటివరకు తన అతిపెద్ద ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా థామా రికార్డ్ క్రియేట్ చేసింది. ఛావా, పుష్ప 2 వంటి చిత్రాలతో రష్మికకు భారీ ఓపెనింగ్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి వరుసగా స్త్రీ, స్త్రీ2 బ్లాక్ బస్టర్లు కావడంతో థామాపై భారీ అంచనాలు పెరిగాయి. ఆపై దీపావళి సెలవులు ఉండటంతో భాగానే కలిసొచ్చింది.
థామా సినిమాలో అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా), తడ్కా (రష్మిక) మెప్పించారు. భేడియాగా ప్రత్యేక పాత్రలో వరుణ్ ధావన్ అదరగొట్టేశాడు. ఈ మూవీ సెకడాఫ్ చాలా బాగుందని ఎక్కువగా రివ్యూస్ వచ్చాయి. మలైకా అరోరా, నోరా ఫతేహి ప్రత్యేక గీతాల్లో కనిపించి మెప్పించారు. సచిన్-జిగర్ సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


