
దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియా మాలిక్ (Priya Malik) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్ అంటుకుంది.
ఫోటోలు దిగుతుండగా..
క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్‌కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.
నాకే ఆశ్చర్యం!
చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ 9తో పాపులర్ అయిన ప్రియ మాలిక్.. 2022లో ఎంటర్‌ప్రెన్యూర్ కరణ్ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్ జన్మించాడు.
చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ