
బుల్లితెర నటి చవీ మిట్టల్ (Chhavi Mittal) ఒకప్పుడు క్యాన్సర్‌ను జయించింది. ఆరోగ్యంగా ఉండేందుకు తను ప్రయత్నిస్తుంటే ఓ వ్యక్తి ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. అది చూసిన చవీ మిట్టల్‌కు ఒళ్లు మండిపోయింది. సోషల్ మీడియా వేదికగా సదరు నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఆమె సరదాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో తను స్వీట్ పొటాటోస్ తింటోంది. అవతలి వ్యక్తి ఫ్రై చేసిన స్నాక్స్ ఇస్తుంటే వద్దని తిరస్కరించింది.
అయినా క్యాన్సర్ వచ్చిందిగా!
ఈ వీడియో కింద ఓ వ్యక్తి.. నువ్వు ఆరోగ్యానికి మంచివైనవాటిని ఏరికోరి ఎంచుకుని తింటున్నా సరే క్యాన్సర్ (Cancer) వచ్చింది. నీ మీద నువ్వే జోక్ వేసుకున్నట్లు ఉంది. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకో, కానీ షో ఆఫ్ చేయకు. ఎవరినీ ఎగతాళి చేయకు. హెల్తీ ఫుడ్ తింటావో, తినవో అది నీ ఇష్టం. కొంచెం అన్‌హెల్తీ ఫుడ్ తినమని ఎవరైనా అడిగినప్పుడు దాన్ని మరీ సీరియస్‌గా తీసుకోనక్కర్లేదు.
క్యాన్సర్ అంటే జోకా?
సలహాలు అసలే ఇవ్వనక్కర్లేదు అని కామెంట్ చేశాడు. దానిపై చవీ తీవ్రంగా స్పందించింది. క్యాన్సర్ అంటే జోక్ కాదు అని మండిపడింది. మంచి ఆహారపు అలవాట్లు పాటించినప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, క్యాన్సర్ వారియర్స్‌కు ఈ నెగెటివ్ కామెంట్ పెట్టిన వ్యక్తి తరపున నేను క్షమాపణలు చెప్తున్నా.. ఇలాంటి నెగెటివ్ మనుషుల వల్ల మీ ఆలోచనలు, పద్ధతులు మార్చుకోకండి.

నష్టపోతే వదిలేస్తామా?
అనారోగ్యం, క్యాన్సర్ అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండదు. మనం చేయాల్సిందల్లా మన జాగ్రత్తలో మనం ఉండటం! వ్యాపారంలో కూడా కొన్నిసార్లు నష్టపోతాం, అలా అని దాన్ని వదులుకోం కదా! ఇదీ అంతే! ఆరోగ్యంగా ఉండేందుకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. కొన్నిసార్లు విజయం సాధించలేకపోయినంత మాత్రాన వెనకడుగు వేయకూడదు అని రాసుకొచ్చింది.
క్యాన్సర్‌ను జయించిన నటి
చవీ మిట్టల్.. 2022 ఏప్రిల్‌లో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ప్రారంభదశలోనే మహమ్మారిని గుర్తించి వెంటనే చికిత్స మొదలుపెట్టింది. ఆపరేషన్ కూడా చేయించుకుంది. తర్వాత క్యాన్సర్‌ను జయించినట్లు ప్రకటించింది. మరుసటి ఏడాది కాస్టోకోన్‌డ్రైటిస్ వ్యాధి బారిన పడింది. ఈమె ఏక్ వివాహ్.. ఐసా భీ, పల్ పల్ దిల్‌కే సాత్ వంటి చిత్రాల్లో నటించింది.
సీరియల్స్
బుల్లితెరపై ఘర్‌కీ లక్ష్మి బేటియా, నాగిన్, బందిని, ఏక్ చుట్కీ ఆస్మన్, లాల్ ఇష్‌క్ వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. రచయిత, నిర్మాతగానూ గుర్తింపు పొందింది. డైరెక్టర్ మోహిత్ హుస్సేన్‌ను 2004లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు అరీజా, కుమారుడు అర్హం సంతానం.