
ఇంపోర్టెడ్ కార్లు, ఇంద్ర భవనాలు,నుంచి కళాఖండాలను దాటి క్రికెట్ టీమ్స్ దాకా కాదేదీ అనర్హం. తారల దర్పానికి, స్టార్ డమ్ ప్రదర్శనకి అన్నట్టుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే కార్ల ట్రెండ్ పాతబడుతూ వాటి స్థానంలో ప్రైవేట్ జెట్స్ సైతం సూపర్ స్టార్లకు అలంకారంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌కి చెందిన ఓ అందాల నటి ఏకంగా ఐలాండ్‌నే కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ వార్త వినగానే మన కళ్ల ముందు మెదిలే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, అలియా భట్, ఐశ్వర్యా రాయ్ వంటివారు ముందుండడం సహజమే.
అయితే వీరందరూ కాకుండా.. నిజం చెప్పాలంటే విజయాల్లో వీరి సరసన నిలబడే స్థాయి లేని నటి ఐలండ్ క్వీన్‌గా మారిందనేది తెలుసుకోదగ్గ విశేషమే. ఆమె పేరు గ్లామర్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండెజ్. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి సక్సెస్ అయిన తారల్లో ఒకరు శ్రీలంకకు చెందిన జాక్వలిన్. దాదాపు పాతికేళ్ల క్రితం 2006లో మిస్ యూనివర్స్ పోటీల్లో శ్రీలంకకు సారధ్యం వహించిన ఈ బ్యూటీకి కిరీటం దక్కకపోయినా బాలీవుడ్ ఛాన్సులు దండిగానే దక్కాయి. అలా 2009 నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ అదే పనితో ఆగిపోకుండా రకరకాల వ్యాపారాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. ఇప్పటికే ముంబైలో, శ్రీలంకలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు సైతం ఆమె స్వంతం. స్టార్ డమ్‌లో దిగువన ఉన్నా ఇన్ కమ్‌లో ముందున్న ఈ భామ ఆస్తులు దాదాపుగా రూ.100కోట్ల పైమాటే అని సమాచారం.
ఈ నేపధ్యంలోనే ఆమె స్వదేశంలో, అంటే శ్రీలంక తీర ప్రాంతంలో ఒక ప్రైవేట్ దీవిని కూడా ఆమె కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇది బహిరంగంగా ఆమె ప్రకటించని విషయమే అయినా, తాజాగా వెలుగులోకి వచ్చింది. జాక్వలిన్ ఈ ప్రైవేట్ దీవిని కుటుంబం కోసం కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగాయో కానీ, అది పూర్తి స్థాయిలో పర్యాటకుల నుంచి దూరంగా, నిశ్శబ్దత నడుమ ఆమె తన కోసం విశ్రాంతి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమని అంటున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడం వల్ల బాలీవుడ్‌లో జాక్వలిన్ స్థానం, ఆమె సంపద, జీవనశైలి పై కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్‌లో ఇది అరుదైన విషయమే మరి. నటుల్లో స్వంత దీవిని కలిగిన నటి అనే ఘనతను జాక్వలిన్ ఒక్కరే దక్కించుకుంది.
ఎక్కడ? ఎప్పుడు?
శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంగా 2012లో సుమారు 4 ఎకరాల ప్రైవేట్ దీవిని సుమారుగా రూ.3కోట్లకు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ దీవి ఖరీదు చేసినప్పుడు, ‘విలాసవంతమైన విల్లా నిర్మాణం‘ ఉండొచ్చని అంచనా వేశారట, అయితే అక్కడ అలాంటి నిర్మాణం జరిగిందా లేదా అనేది స్పష్టంగా వెలుగు చూడలేదు. ఈ దీవి, మాజీ శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కరా కి చెందిన సొంత దీవి దగ్గరనే ఉందని కూడా తెలుస్తోంది.
కొసమెరుపు ఏమిటంటే... ఓ నాలుగేళ్ల క్రితం ఈ జాక్వెలిన్ పై మనీ లాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా విచారణకు హాజరైంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఘోస్ట్ సినిమాలో మన కింగ్ అక్కినేని నాగార్జున సరసన తెలుగులో నటించడానికి వచ్చిన ఛాన్స్ చేజారినట్టు సమాచారం.