ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు.. అవినీతి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైల్వే టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు ఈ సన్నాహాలు చేస్తోంది.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. రైలు టికెట్లు పొందడం ప్రయాణికులకు చాలా కష్టంగా మారింది. టికెట్ బుకింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సీట్లు పూర్తవుతున్నాయని చాలామంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా బాట్స్, టౌట్స్, నకిలీ ఖాతాలు, మోసపూరిత యూజర్ ఐడీలు అని అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ మూడు కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. అదనంగా మరో ఆరు కోట్ల ఖాతాలను పరిశీలన కోసం గుర్తించింది. టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా.. 4.2 లక్షల అనుమానాస్పద పీఎన్‌ఆర్‌లకు సంబంధించిన 501 ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదు చేసింది. అలాగే నకిలీ డిజిటల్ గుర్తింపులతో సంబంధం ఉన్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్‌లను కూడా బ్లాక్ చేసింది. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు టికెట్లు అందుబాటులోకి రావడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ట్రైన్ టికెట్ తొందరగా బుక్ అవ్వాలంటే?
- మీ IRCTC ఖాతాలో ముందుగానే లాగిన్ అయి ఉండండి.
- ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోండి.
- వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించండి.
- బుకింగ్ ప్రారంభ సమయానికి 5-10 నిమిషాల ముందే సిద్ధంగా ఉండండి.
- యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోండి.
- తత్కాల్ టికెట్ అయితే బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికే ప్రయత్నించండి.
- ఒకేసారి అనేక బ్రౌజర్ ట్యాబ్‌లు లేదా పరికరాల్లో ప్రయత్నించవద్దు.
- తక్కువ రద్దీ ఉన్న ప్రత్యామ్నాయ రైళ్లు, తేదీలను కూడా పరిశీలించండి.
- బుకింగ్ పూర్తయ్యే వరకు పేజీని రిఫ్రెష్ చేయకుండా జాగ్రత్తగా కొనసాగించండి.
ఇదీ చదవండి: డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ


