ఐఆర్‌సీటీసీ.. మూడు కోట్ల అకౌంట్లు క్లోజ్! | IRCTC Cracks Down On Ticketing Fraud, Deploys AI Cameras In 800 Railway Kitchens And 3 Crore Fake IDs Suspended | Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీ.. మూడు కోట్ల అకౌంట్లు క్లోజ్!

Jun 4 2026 11:09 AM | Updated on Jun 4 2026 11:55 AM

IRCTC 3cr Fake Accounts Blocked AI Cameras in Railway Kitchens

రైల్వే ప్రయాణికులకు మరింత పారదర్శకమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మెగా ఆపరేషన్‌కు తెరలేపింది. ఒకవైపు కన్ఫర్మ్‌డ్‌ టిక్కెట్ల కోసం సామాన్య ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగుతున్న టికెటింగ్ మాఫియాకు చెక్ పెడుతూ, మరోవైపు రైళ్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా 3 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను నిలిపివేయడంతో పాటు రైల్వే వంటశాలల్లో నాణ్యతను పర్యవేక్షించడానికి ఏఐ కెమెరాలను తీసుకొచ్చింది.

టికెట్ దందాపై చర్యలు

సాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకకుండా బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ముఠాలు, దళారీల ఆట కట్టించేందుకు ఐఆర్సీటీసీ డిజిటల్ నిఘాను తీవ్రం చేసింది. ఇందులో భాగంగా తీసుకున్న కీలక చర్యలు చేపట్టింది.

  • డిజిటల్ గుర్తింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3 కోట్లకు పైగా అనుమానాస్పద వినియోగదారుల ఖాతాలను ఐఆర్సీటీసీ బ్లాక్ చేసింది.

  • వీటితో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో ఆరు కోట్ల ఐడీల ప్రామాణికతను తనిఖీ చేయడానికి వాటిని కఠినమైన ధ్రువీకరణ పరిధిలో ఉంచింది.

  • గత ఏడాది కాలంలో అక్రమ బుకింగులకు కారణమవుతున్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను అధికారులు పూర్తిగా నిషేధించారు.

  • నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్‌లకు సంబంధించి 501 అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి.

800 కిచెన్లలో ఏఐ కెమెరాలు

రైలు ప్రయాణంలో లభించే భోజనంపై తరచూ వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఐఆర్సీటీసీ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా బేస్ కిచెన్లలో (వంటశాలలు) పరిశుభ్రత, కార్యాచరణ లోపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు 2,394 ఏఐ ఎనేబుల్డ్ కెమెరాలను మోహరించింది.

తొమ్మిది రకాల ఉల్లంఘనలను పట్టేసే టెక్నాలజీ

ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ వంటశాలల్లో జరిగే 9 రకాల ప్రధాన ఉల్లంఘనలను ఇట్టే పసిగడుతుంది. వంట చేసేవారు తలకు క్యాప్ పెట్టుకోకపోవడం, చేతి తొడుగులు (గ్లౌజెస్‌) ధరించకపోవడం, వంటగదిని సరిగ్గా తుడవకపోవడం వంటి లోపాలతో పాటు వంటశాలల్లో ఎలుకలు, ఈగలు, బొద్దింకల కదలికలను కూడా ఈ కెమెరాలు క్షణాల్లో గుర్తిస్తాయి.

టూ-అవర్స్ డెడ్‌లైన్.. వార్ రూమ్ పర్యవేక్షణ

ఈ సాంకేతికత ఎంతటి చిన్న వస్తువునైనా, లోపాన్నైనా సులభంగా గుర్తించగలదని ఐఆర్సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘వంటశాలల్లో పరిశుభ్రత లోపిస్తే ఏఐ కెమెరాలు స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌) హెచ్చరికలను జారీ చేస్తాయి. ఈ అలర్ట్ నేరుగా సంబంధిత కిచెన్ మేనేజర్‌కు వెళ్తుంది. ఐఆర్సీటీసీ ప్రత్యేక వార్ రూమ్ దీనిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. అలర్ట్ వచ్చిన రెండు గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వార్ రూమ్ పర్యవేక్షణ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం వంటశాలల్లో హెడ్ క్యాప్‌లు ధరించకపోవడం అనేదే అత్యంత ప్రాథమిక, ప్రధాన ఉల్లంఘనగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గేదె హెయిర్‌ స్టైల్‌కు ఫుల్‌ క్రేజ్‌!

Advertisement
 
Advertisement
Advertisement