
న్యూఢిల్లీ: దేశీ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 3,067 కోట్లను అధిగమించింది. ఇది క్యూ4లో కంపెనీ సాధించిన రికార్డ్ లాభంకాగా.. ఇందుకు విమాన ప్రయాణికులు పెరగడం సహకరించింది.
అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,895 కోట్లు ఆర్జించింది. ఇండిగో బ్రాండ్ విమాన సర్వీసుల కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 18,505 కోట్ల నుంచి రూ. 23,098 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
ప్రయాణికుల జోరు
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండిగో నికర లాభం రూ. 7,258 కోట్లను అధిగమించింది. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే దాదాపు రూ. 8,868 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాది 11.8 కోట్లమంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేసినట్లు సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.
కాగా.. క్యూ4లో ఇండిగో ప్రయాణికుల టికెట్ ఆదాయం 25% జంప్‌చేసి రూ. 19,567 కోట్లను దాటింది. అనుబంధ విభాగాల ఆదాయం 25 శాతం అధికమై రూ. 2,153 కోట్లకు చేరింది. మొత్తం నగదు నిల్వలు రూ. 48,170 కోట్లను అధిగమించగా.. విమానాల సంఖ్య 400ను దాటింది. ఇండిగో షేరు బీఎస్‌ఈలో 0.4% లాభంతో రూ. 5,466 వద్ద ముగిసింది.