
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, అంతర్జాతీయంగానూ అవకాశాలు విస్తరిస్తున్నాయని చెబుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) జీడీపీ వృద్ధి 6.4 - 6.7 శాతం వరకు నమోదు కావొచ్చని తెలిపింది.
దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుండడం, ద్రవ్యోల్బణం దిగిరావడాన్ని సానుకూలతలుగా పేర్కొంది. అంతర్జాతీయంగా వాణిజ్య అవకాశాలను పర్యవేక్షిస్తూ.. భౌగోళికపరమైన అనిశ్చితులకు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. యూకేతో వాణిజ్య ఒప్పందానికి తోడు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతుండడం, ఐరోపా సమాఖ్యతో వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివరికి సాకారమయ్యే అవకాశాలు.. ఇవన్నీ భారత వాణిజ్య అవకాశాలను విస్తృతం చేస్తాయని, అధిక ఆదాయం, ఉద్యోగాలు, మార్కెట్ అవకాశాలను, దేశీ డిమాండ్‌ను పెంచుతాయని వివరించింది.
గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఆర్థిక కల్లోలిత వాతావరణంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండడాన్ని ప్రత్యేకమైనదిగా ప్రస్తావించింది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు, చౌక మానవ వనరులు ఉండడాన్ని సానుకూలతలుగా డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వాణిజ్య అవకాశాలను పెంచుకునేందుకు భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు డెలాయిట్ ఇండియా తెలిపింది.
ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పాన్ 2.0: పాత కార్డులు రద్దవుతాయా?
ఇటీవలి వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకమైనవిగా అభివర్ణించింది. ఏఐ, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణల ఆధారిత స్టార్టప్ విభాగాల్లో సహకారాన్ని ఈ ఒప్పందాలు మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషించింది. కాకపోతే ఇటీవలి చోటు చేసుకున్న ప్రాంతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, కీలక ఖనిజాలు, ఫర్టిలైజర్స్‌పై ఆంక్షలు వంటివి వృద్ధి అవకాలను ప్రభావితం చేస్తాయని తెలిపింది.