
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరు ప్రాంతాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ డీల్ కుదరడంతో స్పిరిట్లపై దిగుమతి సుంకాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియం అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా అందించే వీలుందని భావిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై సరాసరిగా రూ.300 వరకు ధరల తగ్గింపు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దీర్ఘకాలంలో ఇరుదేశాల వాణిజ్యాన్ని 35 బిలియన్ డాలర్లకు పెంచుతుంది. ఈ డీల్ కోసం మూడేళ్లకు పైగా సాగుతున్న చర్చల ఫలితంగా మే నెలలో ఎఫ్‌టీఏను ఖరారు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, యూకే ప్రధాని జోనాథన్ రేనాల్డ్స్ ఒప్పందంపై తాజాగా సంతకాలు చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య లండన్‌లో కుదిరిన ఎఫ్‌టీఏ ప్రకారం యూకే విస్కీ, జిన్‌లపై సుంకాన్ని భారత్ 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించనుంది. ఈ ఒప్పందం కుదిరిన పదేళ్లలో మరో 40 శాతం సుంకాలు తగ్గించేలా నియమాలున్నాయి.
విస్కీ ధరలపై నిపుణుల అంచనాలు
భారతదేశంలో ప్రీమియం ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ) ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఆల్కహాలిక్ బేవరేజ్ రంగానికి చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించింది. ఈ ఒప్పందం వల్ల ప్రీమియం అంతర్జాతీయ స్పిరిట్స్ మరింత అందుబాటులోకి వస్తాయని, ఈ డీల్ భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఎస్‌డబ్ల్యూఏఐ సీఈఓ సంజిత్ పాధి తెలిపారు. ఇది హాస్పిటాలిటీ, టూరిజం, రిటైల్ వంటి అనుబంధ రంగాల్లో వృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇండియన్స్‌ను వద్దంటే యూఎస్‌కే నష్టం
పెద్దగా మార్పు ఉండదు..
దిగుమతి చేసుకున్న స్కాచ్ (విస్కీ) వినియోగదారుల ధరల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదని మద్యం పరిశ్రమ నిపుణుడు వినోద్ గిరి తెలిపారు. మద్యంపై పన్నులు చాలా వరకు రాష్ట్రాల్లోనే ఉన్నాయని, కస్టమ్స్ సుంకం తగ్గింపు జరిగినా దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీల వినియోగదారుల ధరలపై ప్రభావం ఒక్కో బాటిల్‌పై సరాసరి రూ.100-300 మధ్య ఉంటుందని తెలిపారు.