
భారత్ వంటి దేశాలతో సహా విదేశాల్లో నియామకాలను నిలిపివేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేశం పంపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణాలు లేకపోలేదు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ అక్కడి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోపాటు ఇంకా కొన్ని కారణాలున్నాయి. అయితే దీని అమలు చేస్తే యూఎస్ సాంకేతిక అభివృద్ధి మందగిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
జాతీయవాదం, అమెరికా ఫస్ట్ ఎజెండా
2025 జులై 23-24 తేదీల్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ రాడికల్ గ్లోబలిజం నుంచి టెక్ కంపెనీలు బయటకు రావాలని నొక్కి చెప్పారు. టెక్ కంపెనీలు యూఎస్ నుంచి ప్రయోజనం పొందుతున్నాయని చెబుతూ, చైనా, భారత్ వంటి దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఎత్తిచూపారు. అమెరికాలో ఉపాధిని పెంచేందుకు స్థానిక టెక్నాలజీ కంపెనీలు ముందుకు రావాలన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ
ఇదే సదస్సులో కృత్రిమ మేధకు సంబంధించి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో కృత్రిమ మేధ అభివృద్ధిని పెంచడానికి, దేశ పురోగతి అడ్డంకులను తగ్గించడానికి ‘విన్నింగ్ ది రేస్’ పేరుతో జాతీయ వ్యూహాన్ని తెలియజేశారు. ఈ ప్రణాళికలో డేటాసెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా, కృత్రిమ మేధకు అవసరమైన మౌలిక సదుపాయాలను కంపెనీలు సులభంగా నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాను కృత్రిమ మేధలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. ఏఐని అభివృద్ధి చేయడానికి ఫెడరల్ ఫండింగ్ పొందే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఉత్తర్వుపై సంతకం చేశారు. అందులో భాగంగా కంపెనీలు రాజకీయంగా తటస్థంగా ఉండే ఏఐ టూల్స్‌ను తయారు చేయాల్సి ఉంటుంది.
హెచ్-1బీ వర్క్ వీసాలపై ఆందోళన
ట్రంప్ గత హయాంలో జారీ చేసిన బై అమెరికన్, హైర్ అమెరికన్ కార్యనిర్వాహక ఉత్తర్వులను పునసమీక్షించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా టెక్ సంస్థల్లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా విధానాలపై ఇది ఒత్తిడి తెస్తుంది. ఈ వీసా అమెరికా కంపెనీలు స్థానిక సిబ్బంది కంటే విదేశీ ప్రతిభావంతులపై ఎక్కువగా ఆధారపడటానికి ప్రోత్సహిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.
ఇప్పటికే హెచ్చరికలు..
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. భారత్‌లో నియామకాలు ఆపేయాలనే ట్రంప్ హెచ్చరిక కంపెనీల దీర్ఘకాలిక కార్యకలాపాలకు సవాలుగా మారుతుంది. ఇప్పటికే యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్ ఉద్యోగులను తిరిగి యూఎస్‌కు రప్పించాలని కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదీ చదవండి: త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
నష్టమేంటి..?
ట్రంప్ వ్యాఖ్యలపై భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రతిభావంతులకు భారతదేశం నెలవుగా కొనసాగుతోంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలకు సహాయపడటం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ టెక్ ఎకోసిస్టమ్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ ఇన్‌ఫ్రా కోసం భారతీయ ఇంజినీర్లు, డెవలపర్లు, పరిశోధకులు గణనీయంగా దోహదపడుతున్నారు. భారత్ నుంచి నియామకాలను నిలిపివేస్తే అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి మందగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.