ప్రీమియం వ్యాల్యూషన్ సొంతం
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా
న్యూఢిల్లీ: త్వరలో ఐపీవోకు రాబోతున్న జియో ప్లాట్‌ఫామ్స్‌కు మంచి విలువ లభిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. 2020–21లో దిగ్గజ టెక్నాలజీ సంస్థలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించడాన్ని ప్రస్తావిస్తూ.. 2027 సెపె్టంబర్ నాటికి కంపెనీ విలువ 148 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.13.02 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పేర్కొంది.
బలమైన ఆర్థిక, వ్యాపార మూలాల నేపథ్యంలో టెలికం కంపెనీల వ్యాల్యూషన్లను బ్రోకరేజీ సంస్థ పెంచింది. టారిఫ్‌లు (చార్జీలు) మెరుగుపడడం, 5జీ వినియోగం పెరుగుతుండడంతో ప్రీమియం ధోరణికి దారితీస్తుందంటూ.. జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత లిస్టింగ్ (స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో) సైతం కంపెనీ విలువలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం, డిజిటల్ వ్యాపారాలకు కేంద్రంగా ఉన్న జియో ప్లాట్‌ఫామ్స్ 2026 ప్రథమార్ధంలో ఐపీవోకు రావాలనుకుంటోంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో అవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఇన్వెస్టర్లు అందరికీ జియో ప్లాట్‌ఫామ్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని, భవిష్యత్తు మరింత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవలే వాటాదారుల సమావేశంలో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.
ఐదేళ్లలో రెట్టింపు
2020–21లో జియో ప్లాట్‌పామ్స్‌లో వాటాల విక్రయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టగా, అప్పటికి కంపెనీ విలువ 65–70 బిలియన్ డాలర్లుగా ఉన్న విషయాన్ని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది. 13 అగ్రగామి ఇన్వెస్టర్లకు 32.9 శాతం వాటాల విక్రయం ద్వారా జియో రూ.1,52,056 కోట్లను సమీకరించడం గమనార్హం. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్‌కు ప్రస్తుతం 66.3 శాతం వాటా ఉంది.
ఫేస్‌బుక్‌కు 10 శాతం, గూగుల్‌కు 7.7 వాతం చొప్పున వాటాలున్నాయి. టెలికం రంగంలో అత్యధిక చందాదారులతో నంబర్ 1 స్థానంలో ఉన్నందున జియో ప్లాట్‌ఫామ్స్‌కు ప్రీమియం విలువ దక్కుతుందన్నది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. 2025–28 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ నికర లాభం ఏటా 46.7 శాతం చొప్పున పెరుగుతుందని పేర్కొంది.


