అసోచామ్ డిమాండ్
ప్రతిష్టాత్మక జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కింద ఇన్‌ఫ్రా కంపెనీలకు బకాయిల చెల్లింపులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసోచామ్ కోరింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పైపుల ద్వారా సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించినదే జల్ జీవన్ మిషన్.
‘సర్టిఫైడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 10–12 నెలల నుంచి బిల్లుల చెల్లింపులు అపరిష్కృతంగా ఉండడం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద పనులపై ప్రభావం చూపిస్తోంది’ అంటూ కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖలో అసోచామ్ పేర్కొంది. కేంద్రం తగినంత నిధులు కేటాయించినప్పటికీ యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అసోం, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగలేదన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వేలాది కోట్ల రూపాయిల బకాయిలు పేరుకుపోయినట్టు తెలిపింది.
2024–25 సంవత్సరానికి ఒక్క యూపీలోనే కాంట్రాక్టర్లకు రూ.11,000 చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్టు, జార్ఖండ్‌లో రూ.3,800 కోట్లు, ఒడిశాలో రూ.2,500 కోట్లు, పశ్చిమబెంగాల్‌లో రూ.5,000 కోట్లు, మహారాష్ట్రలో రూ.12,500 కోట్ల చొప్పున కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాల్సి ఉందని పేర్కొంది. తీవ్ర జాప్యం కారణంగా కొన్ని జిల్లాల్లో పనులు నిలిచిపోవడం లేదా నిదానించినట్టు తెలిపింది.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా


