
మంత్రివర్గ సమావేశం వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర జల్‌జీవన్ మిషన్ ఇచ్చే నిధులకు రాష్ట్ర మ్యాచింగ్ వాటా కోసం స్వయంప్రతిపత్తి సంస్థగా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతి మలి విడత భూ సమీకరణపై మంత్రుల కమిటీ రైతులతో మరింత సమగ్రంగా చర్చిస్తుందని తెలిపారు. ఈ సమీకరణ ఎందుకన్నదీ వివరించిన తర్వాత ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా, దీంతో రాజధాని మలి విడత భూ సమీకరణకు ఆమోదం వాయిదా పడింది.
ప్రస్తుత సీజన్‌లో రైతుల నుంచి 6.50 లక్షల టన్నుల తోతాపురి మామిడి పంట సేకరణ, కిలోకు రూ.4 చొప్పున చెల్లింపునకు రూ.260 కోట్ల మంజూరుకు అంగీకారం. రూ. 286.20 కోట్లతో ప్రకాశం బ్యారేజీ ముందుభాగంలో ఇసుక తొలగింపునకు పరిపాలన అనుమతి. దీనిని లంప్సమ్ కాంట్రాక్ట్ విధానంలో చేపట్టేలా టెండర్లకు ఆహా్వనం. అన్ని అనుమతులతో పాటు ఇసుక తొలగింపు పనులను జల వనరుల శాఖ బదులు సీఆర్‌డీఏకు అప్పగింత.
కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల అభివృద్ధికి నిధుల కోసం, కుప్పం విమానాశ్రయానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్, అత్యవసర పెండింగ్ పనుల పూర్తికి హడ్కో నుంచి రూ.వెయ్యి కోట్ల రుణం సమకూర్చుకునేందుకు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్‌కు అనుమతి.
అమరావతిలోని నేలపాడులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సరీ్వసుల అధికారుల నివాస సముదాయం పనుల్లో వేగం పెంచాలని నిర్ణయం. మిగిలిన పనుల పూర్తికి రూ.524.70 కోట్ల మంజూరుకు ఆమోదం.
అమరావతి భూ కేటాయింపు నిబంధనలు–2017 ప్రకారం సీఆర్‌డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులను సమీక్షించే ప్రతిపాదనకు అంగీకారం. æ మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే అప్పు చేసిన రూ.6,700 కోట్లకు అదనంగా రూ.వెయ్యి కోట్లు అప్పు చేసేందుకు జారీ చేసిన జీవోకు ఆమోదం.
రైతులకు ధాన్యం బకాయిల కోసం రూ.672 కోట్లు మంజూరు. గురువారం నుంచి రైతుల ఖాతాల్లో జమ.
కోకో గింజల సేకరణ కోసం రూ.14.88 కోట్లు మంజూరు.
అమరావతిలో “వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఏపీ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్’ స్థాపనకు ఆమోదం.
నీటి వనరుల శాఖలోని వివిధ చీఫ్ ఇంజనీర్ల ఆధీనంలో ఉన్న 71 పనుల కొనసాగింపు
నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు మధ్య తరహా ప్రాజెక్ట్ కింద కుడి ప్రధాన కాలువ స్లూయిస్‌ల అత్యవసర మరమ్మతులకు రూ.22.50 లక్షలు.
అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ సరిహద్దును మార్చడానికి, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల తరలింపునకు పరిహారంగా అదనంగా 790 ఎకరాల సేకరణ, మొత్తం 2001.80 ఎకరాలు బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు బదిలీకి, స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయింపునకు అనుమతి.
ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–2025–30కు ఆమోదం.
నెల్లూరు జిల్లాలో పెట్రోలియం రిఫైనరీ–పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్, ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్, రామాయపట్నం పోర్ట్ రెండవ దశ, సంబంధిత లాజిస్టిక్స్ పారిశ్రామిక టౌన్íÙప్ ప్రాజెక్టుల కోసం భూ సేకరణను పూర్తి చేయడానికి రెండేళ్ల కాలానికి కందుకూరు–కావలిలో స్పెషల్ కలెక్టర్ యూనిట్, ఐదు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ల ఏర్పాటు
రాజధాని పరిధిలో 1,575 మంది భూమి లేని పేదలకు పెన్షన్ల పునరుద్ధరణకు ఆమోదం.
2022 జనవరి 13న హింసాత్మక దాడిలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం.