అకాల మరణం.. ప్రతి ఉద్యోగి జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదం. ఉద్యోగులు చనిపోతే ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారికి ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి వారి కుటుంబం ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. అదే చిన్న సంస్థలో తక్కువ జీతానికి పనిచేస్తూ ఇంటి ఖర్చులను నెట్టుకొస్తున్న వారి కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆ సమయంలో ఉద్యోగి పోగుచేసుకున్న ఈపీఎఫ్‌తోపాటు మరొక కీలకమైన భద్రత తోడుగా ఉందని గుర్తుంచుకోవాలి. అదే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI). ఈపీఎఫ్‌ఓ ఆధ్వర్యంలో 1976లో ప్రారంభమైన ఈ పథకం ఉద్యోగుల కుటుంబాలకు ఒక నిర్దిష్ట మొత్తంలో బీమా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఉద్యోగులకు ఆర్థిక భద్రతను అందించే ఈపీఎఫ్‌ఓ ఫ్రేమ్‌వర్క్‌లో ఇది కీలకంగా ఉంది.
ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)
ఈడీఎల్‌ఐ అనేది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యుల కోసం ఉద్దేశించిన బీమా పథకం. ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వచ్చే ఏ ఉద్యోగి అయినా సర్వీసులో ఉండగా మరణిస్తే వారి నామినీ లేదా చట్టపరమైన వారసులకు ఈ పథకం కింద ఏకమొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తారు.
ఈపీఎఫ్ ఉన్నా ఈడీఎల్‌ఐ అవసరం ఏమిటి?
చాలా మందికి వచ్చే సందేహం ఇదే. ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం, పెన్షన్ (EPS) అందుబాటులో ఉంటాయి. అయితే ఈడీఎల్‌ఐ వీటి కంటే భిన్నంగా పనిచేస్తుంది. ఈపీఎఫ్ అనేది ఉద్యోగి దాచుకున్న పొదుపు. కాగా, ఈడీఎల్‌ఐ అనేది బీమా. ఇది తక్షణమే బాధిత కుటుంబానికి ఏకమొత్తంలో ద్రవ్య సహాయాన్ని అందించి, ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.
ఈడీఎల్‌ఐ ప్రీమియాన్ని పూర్తిగా కంపెనీయే భరిస్తుంది. ఉద్యోగి వేతనంలో ఎలాంటి కోత లేకుండా ఉచితంగా ఈ బీమా కవరేజీని పొందవచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఈపీఎఫ్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈడీఎల్‌ఐ కింద రూ.7 లక్షల వరకు బీమా కవరేజీకి అర్హత పొందుతాడు. అంటే ఈపీఎఫ్ పొదుపుతో సంబంధం లేకుండా బీమా భద్రత లభిస్తుంది.
అర్హత ప్రమాణాలు
20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థలు ఈపీఎఫ్ చట్టం కింద నమోదు చేసుకోవాలి. ఈపీఎఫ్‌కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఈడీఎల్‌ఐ కవరేజీ ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. ఈ పథకం ఉద్యోగంలో ఉన్నప్పుడు సంభవించే సహజ మరణం, ప్రమాదం లేదా అనారోగ్యంతో మరణించినా కవరేజీ లభిస్తుంది. ఈపీఎఫ్‌కు ఉన్న నామినీలే దీనికి వర్తిస్తారు.
చెల్లింపులు, బోనస్, లెక్కింపు విధానం
ఈడీఎల్‌ఐ కింద చెల్లించే మొత్తం గరిష్టంగా రూ.7 లక్షలకు పరిమితం చేశారు. ఈ మొత్తాన్ని లెక్కించే విధానంలో బోనస్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మరణించిన ఉద్యోగి కుటుంబానికి స్థిర బోనస్ కింద రూ.2.5 లక్షలు చెల్లిస్తారు. ఈడీఎల్‌ఐ ప్రయోజనాన్ని కింది విధంగా లెక్కిస్తారు.
చెల్లింపు మొత్తం = (30 × ఉద్యోగి సగటు నెలవారీ వేతనం) + బోనస్
సగటు నెలవారీ వేతనం కింద మరణానికి ముందు 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న వేతనాన్ని లెక్కిస్తారు. ఈడీఎల్‌ఐ లెక్కల ప్రకారం ఈ వేతనాన్ని రూ.15,000కు పరిమితం చేశారు.
బోనస్.. రూ.2,50,000 స్థిరం.
(30*రూ.15,000) + రూ.2,50,000(బోనస్) = రూ.4,50,000 + రూ.2,50,000 = గరిష్టంగా రూ.7 లక్షలు.
ఉద్యోగి జీతం రూ.15,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ కనీసం రూ.2.5 లక్షల హామీ చెల్లింపు లభిస్తుంది.
ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?
ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ లేదా చట్టపరమైన వారసులు ఈ ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. ఫారం 5 IFను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయంలో సమర్పించాలి. ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, గార్డియన్షిప్ పత్రం (వర్తిస్తే), క్యాన్సల్ చెక్ జతచేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత క్లెయిమ్‌ను 30 రోజులలోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఆలస్యం అయితే 12% వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: వారసులకు ఎంతెంతో ఇప్పుడే చెప్పేయవచ్చు


