
పాత విధానం తెచ్చేందుకు ట్రంప్ సర్కార్ యత్నం
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదన
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలై తర్వాత బైడెన్ హయాంలో బుట్టదాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ తొలివిడత అమెరికా అధ్యక్షునిగా పరిపాలించిన కాలంలో హెచ్–1బీ వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని నిర్ణయించారు.
ఆ విధానాన్నే ఆనాడు అమలుచేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్ సర్కార్ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్ సర్కార్ ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తిపలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా హెచ్–1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులోభాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపింది.
వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని హెచ్–1బీ వీసాలు జారీ చేయాలనే పరిమితిని అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు.
2026 ఏడాదికి జారీచేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావడంతో వాటి ప్రాసెస్‌ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్ విభాగం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది. పొజిషన్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియలను అమెరికాలోని ఆర్థికరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా హెచ్–1బీ వీసాలు దక్కే అవకాశం ఉండటంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు.