
చిప్ తయారీ సంస్థ ఇంటెల్ త్వరలో 25,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గత ఏడాది చివరి నాటికి 1,08,900 మంది ఉద్యోగులను తగ్గించిన కంపెనీ 2025 చివరి నాటికి మరో 75,000 మంది ఉద్యోగులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 2025 నుంచి ఇంటెల్ ఇప్పటికే సుమారు 15,000 కొలువులను తగ్గించుకుంది.
ఇంటెల్ 2025 రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ ఉద్యోగుల తొలగింపు స్థాయిని ధ్రువీకరించింది. పునర్నిర్మాణ ఖర్చులతో సహా కంపెనీ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 12.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం 12.6 బిలియన్ డాలర్ల నుంచి 13.6 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని ఇంటెల్ అంచనా వేసింది.
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బు టాన్ ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ ఎదుర్కొంటున్న క్లిష్ట కాలాన్ని అంగీకరించారు. ‘గత కొన్ని నెలలుగా పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నాయి. సంస్థను క్రమబద్ధీకరించడానికి, మరింత సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. కంపెనీ ‘రీసెట్’లో భాగంగానే ఇలా ఉద్యోగులను తొలగిస్తున్నాం’ అని తెలిపారు. జర్మనీ, పోలాండ్‌ల్లో కొత్త కర్మాగారాలను నిర్మించే ప్రణాళికలను కూడా కంపెనీ విరమించుకుంది. కంపెనీ ఒహియో సైట్‌లో ఉత్పత్తి వేగం తగ్గిపోయింది. కోస్టారికాలో కొన్ని కార్యకలాపాలను వియత్నాం, మలేషియాకు తరలించారు. నిర్వహణ వ్యయాలను తగ్గించడానికి, దాని ప్రపంచ కార్యకలాపాల అంతటా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఇంటెల్ తెలిపింది.
ఇదీ చదవండి: ప్రమాణాలను పెంచండి, విశ్వాసాన్ని గెలవండి
ఒకప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఇంటెల్ ఇటీవలి కాలంలో కష్టాల్లో పడింది. 1990వ దశకంలో పర్సనల్ కంప్యూటర్ బూమ్ సమయంలో మైక్రోప్రాసెసర్ వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు ఎన్‌వీడియా వంటి సంస్థల నేతృత్వంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ చిప్ విభాగంలో వెనుకబడింది. వెంచర్ క్యాపిటలిస్ట్, ఇంటెల్ బోర్డు సభ్యుడు లిప్-బు టాన్ మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ బ్యూరోక్రసీని తగ్గించి, తమ ఉత్పత్తులకు డిమాండ్ సృష్టిస్తానని హామీ ఇచ్చారు.