
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధింపులపై ప్రముఖ భారత మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్‌లతో సంస‍్థలు దివాళా తీయడం, వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయేందుకు దారితీయనుందని అన్నారు.
రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా 50శాతం విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలపై మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా స్పందించారు.
అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారత్ 50శాతం టారిఫ్ చెల్లిస్తోంది. వీటివల్ల భారత్‌పై కొంతకాలం ప్రతికూల ప్రభావం పడుంది. పలు సంస్థలు దివాళా తీయోచ్చు. షార్ట్ టర్మ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అంచనా వేశారు.
అదనపు టారిఫ్ కారణంగా భారత్ ఉత్పత్తి రంగంపై 30 నుంచి 40 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అజయ్ బగ్గా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా సమీప భవిష్యత్తులో భారతదేశ జీడీపీ 0.5 శాతం నుంచి 1శాతం వరకు తగ్గుతుంది. రూ.5.25 లక్షల కోట్లు నష్టం వాటిల్లనుంది. అలా అని పరిస్థితులు ఇలాగే స్థిరంగా ఉంటాయా? అని ప్రశ్నిస్తే.. లేదనే సమాధానం చెబుతున్నారు.
రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఆగస్టు 7న నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించింది. నేటి నుంచి మరో 25శాతం అదనపు సుంకాలు.. మొత్తంగా 50శాతం అదనపు సుంకాలు చెల్లిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న దేశాల జాబితాలో చేరినట్లైంది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కొనసాగేందుకు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లను ఆపకపోతే భారత్ ఎగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికల్ని భారత్ భేఖాతరు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ చెల్లించాలని ప్రకటించారు. దీంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది.