అందుబాటు చార్జీల్లో టెలికం సేవలే ప్రభుత్వ లక్ష్యం

India Telecom Sector To Remain Most Affordable says Ashwini Vaishnaw - Sakshi

కేంద్ర మంత్రి వైష్ణవ్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకగా టెలికం సరీ్వసులు భారత్‌లో అందుబాటులో ఉండేలా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించాకా ఇప్పటివరకు టెల్కోలు వాటి నుంచి పూర్తి స్థాయిలో ఆదాయాన్ని అందుకోవడం ఇంకా మొదలుపెట్టని నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

5జీ నెట్‌వర్క్‌పై చేస్తున్న పెట్టుబడులను టెల్కోలు తిరిగి రాబట్టుకోవాలంటే వచ్చే మూడేళ్లలో ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ. 270–300గా ఉండాలనేది విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం అంతర్జాతీయంగా సగటున ఏఆర్‌పీయూ రూ. 600–850గాను, చైనాలో రూ. 580గాను ఉండగా.. భారత్‌లో ఇది రూ. 140–200 స్థాయిలో ఉంది.

మరోవైపు, 6జీ టెక్నాలజీ విషయంలో ప్రపంచానికి సారథ్యం వహించే స్థాయిలో ఉండాలని టెలికం రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నిర్దేశించారని వైష్ణవ్‌ చెప్పారు. ఇందుకోసం పరిశ్రమ, విద్యావేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులతో భారత్‌ 6జీ కూటమిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో యాంటెన్నా గ్రూప్, వేవ్‌ఫామ్‌ గ్రూప్, ఎక్విప్‌మెంట్‌ గ్రూప్‌ అంటూ వివిధ గ్రూప్‌లు ఉన్నాయని, అవన్నీ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పారు. టెలికం రంగాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తోందని వివరించారు.  

టెలికం టారిఫ్‌లు మరింత పెరగాలి
భారతి ఎయిర్‌టెల్‌ సీఈవో విఠల్‌ వ్యాఖ్యలు
భారత్‌లో టెలికం టారిఫ్‌లు అత్యంత చౌకగా ఉన్నాయని, ఇవి ఇంకా పెరగాల్సి ఉందని భారతి ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విఠల్‌ వ్యాఖ్యానించారు. టెలికం పరిశ్రమ లాభదాయకంగా మారాల్సిన అవసరం ఉందని ఇన్వెస్టర్లతో సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘పెట్టుబడులను కొనసాగించాలన్నా, భారత్‌ నిర్దేశించుకున్న డిజిటల్‌ లక్ష్యాలను సాధించడంలో తోడ్పడాలన్నా టెలికం పరిశ్రమ లాభదాయకంగా ఉండాలి.

సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయంపరంగానైనా (ఆర్పు), ప్రతి జీబీకి రేటుపరంగానైనా భారత్‌లో టారిఫ్‌లు చాలా చౌకగా ఉన్నాయి. ఇవి పెరగాల్సిన అవసరం ఉంది. టారిఫ్‌లు పెరుగుతాయా లేదా అనేది కాదు ప్రశ్న.. ఎప్పుడు పెరుగుతాయనేదే ప్రశ్న. అయితే, ఇదంతా మా చేతుల్లో లేదు. వేచి చూడటం తప్ప‘ అని ఆయన పేర్కొన్నారు. 5జీ విషయానికొస్తే నాణ్యమైన సర్వీసులను అందుబాటు ఉంచుతూనే ఓవరాల్‌గా టారిఫ్‌ల పెంపు కొనసాగించాలనేది తమ ఉద్దేశమని విఠల్‌ తెలిపారు.

5జీ నెట్‌వర్క్‌ను అత్యంత వేగంగా, అత్యధికంగా ఏర్పాటు చేసామంటూ దండోరా వేసుకునేందుకు తామేమీ పోటీపడటం లేదని విఠల్‌ చెప్పారు. 5జీ అనేది దీర్ఘకాలిక ప్రయాణమని, ఈ టెక్నాలజీ ఉపయోగపడే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 5జీ ఉచితంగా లభిస్తున్నందుకే వినియోగం అత్యధికంగా ఉంటోందని, టారిఫ్‌లు వేసినప్పటి నుంచే అసలైన వినియోగం తెలుస్తుందని విఠల్‌ అభిప్రాయపడ్డారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top