మెటాకు భారత మార్కెట్‌ కీలకం | India most important nation for Meta | Sakshi
Sakshi News home page

మెటాకు భారత మార్కెట్‌ కీలకం

Oct 26 2022 6:03 AM | Updated on Oct 26 2022 6:03 AM

India most important nation for Meta - Sakshi

కోల్‌కతా: భారత మార్కెట్‌ మెటా ప్లాట్‌ఫామ్స్‌కు కీలకమైనదిగా ఉంటోందని కంపెనీ తెలిపింది. గ్రూప్‌లో భాగమైన ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీచర్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు వేదికగా మారిందని పేర్కొంది. అలాగే లక్షల కొద్దీ క్రియేటర్లు, అసంఖ్యాక బ్రాండ్లు తమ సృజనాత్మకను ప్రదర్శించడానికి, ఆడియెన్స్‌కు మరింత చేరువ కావడానికి మెటా ద్వారా మంచి అవకాశాలు లభిస్తున్నాయని ఫేస్‌బుక్‌ ఇండియా (మెటా) డైరెక్టర్‌ మనీష్‌ చోప్రా తెలిపారు. ‘వివిధ కోణాల్లో మా ప్లాట్‌ఫామ్‌లకు భారత్‌ చాలా కీలక మార్కెట్‌.

పలు కొత్త ఉత్పత్తులు, ఫీచర్లను పరీక్షించి తెలుసుకునేందుకు ప్రధాన మార్కెట్‌గా ఉంటోంది‘ అని మెటా వార్షిక ’క్రియేటర్‌ డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన ’రీల్స్‌’ (పొట్టి ఫార్మాట్‌ వీడియోలు) భారత్‌లో గణనీయంగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ఒక అధ్యయన నివేదిక ప్రకారం దాదాపు 20 కోట్ల మంది ప్రజలు రోజుకు 45 నిమిషాల పాటు రీల్స్‌పై వెచ్చిస్తున్నారని, ఇది 60 కోట్లకు చేరుకోగలదని చోప్రా తెలిపారు. టీ20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ హైలైట్స్‌ను చూపేందుకు ఇటీవలే ఐసీసీతో కూడా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మెటా ప్లాట్‌ఫ్లామ్స్‌ ద్వారా నకిలీ ప్రొఫైల్స్, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు తీసుకుంటూనే ఉన్నామని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement