
13 % పెరిగిన సగటు మూల్యం
ముంబై: డేటా లీకేజీ ఉదంతాల్లో దేశీ కంపెనీలు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇది సగటున 13 శాతం పెరిగి రూ. 22 కోట్లకు చేరింది. 2025లో ఇది రూ. 19.5 కోట్లుగా నమోదైనట్లు టెక్ దిగ్గజం ఐబీఎం ఓ నివేదికలో వెల్లడించింది.
డేటా ఉల్లంఘనలకు సంబంధించి మోసగాళ్లు అమలు చేసే విధానాల్లో ఫిషింగ్ ఎటాక్‌లు (మోసపూరిత కమ్యూనికేషన్ పంపించడం ద్వారా వ్యక్తిగత వివరాలను చోరీ చేయడం) అత్యధికంగా 18 శాతంగా ఉండగా, థర్డ్ పార్టీ వెండార్ల హామీల రూపంలో మోసాలు 17 శాతంగా నమోదయ్యాయి.
ఇక యూజర్ల బలహీనతలను మోసగాళ్లు సొమ్ము చేసుకునే ఉదంతాలు 13 శాతంగా నమోదయ్యాయి. పరిశోధనల విభాగంపై అత్యధికంగా డేటా ఉల్లంఘనల ప్రభావం ఉంటోంది. సగటున చెల్లించుకుంటున్న మూల్యం రూ. 28.9 కోట్లుగా నమోదైంది.
ఆ తర్వాత స్థానాల్లో రూ. 28.8 కోట్లతో రవాణా పరిశ్రమ, రూ. 26.4 కోట్లతో పారిశ్రామిక రంగాలు ఉన్నాయి. కృత్రిమ మేథ వినియోగం పెరుగుతున్నప్పటికీ, 60 శాతం బాధిత కంపెనీల్లో ఇప్పటికీ ఏఐ గవర్నెన్స్ విధానాలు లేవు. లేదా ఇప్పుడిప్పుడే పాలసీని తయారు చేసుకోవడంపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఏఐని వాడేసుకోవాలనే ఆత్రంలో పలు కంపెనీలు సెక్యూరిటీని, గవర్నెన్స్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే వాటిని బలహీనంగా మారుస్తోందని ఐబీఎం ఇండియా, సౌత్ ఏషియా వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ రామస్వామి చెప్పారు.