
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏ రంగంలో చూసినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల కంటే కూడా ఏఐను ఎక్కువగా ఇండియా నమ్ముతోందని కేపీఎంజీ (KPMG) నివేదికలో వెల్లడించింది.
ట్రస్ట్, యాటిట్యూడ్స్, అండ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ గ్లోబల్ స్టడీ 2025పై KPMG వెల్లడించిన నివేదిక కోసం 47 దేశాలలోని సుమారు 48,000 మందిని సర్వే చేసింది. ఇందులో సుమారు 76 శాతం భారతీయులు ఏఐను విశ్వసిస్తున్నట్లు తెలిసింది.
ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాకుండా ఎకానమీ, విద్య, వినోదం వంటి దాదాపు అన్ని పరిశ్రమలలో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో మానవ ప్రమేయం తగ్గుతుందని.. ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని సుమారు 78 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 97 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తమ పనిలో AIని ఉపయోగిస్తున్నారని, 67 శాతం మంది అది లేకుండా తమ పనులను పూర్తి చేయలేరని పేర్కొన్నారు.
భారతదేశంలో ఏఐ వినియోగం పెరిగిపోతుండంతో.. ఏఐ-బేస్డ్ ఆర్థిక వృద్ధి & ఆవిష్కరణలలో ఇండియా అగ్రగామిగా దూసుకెళ్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదుగురిలో ముగ్గురు వ్యక్తులు ఏఐను విశ్వసిస్తారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో ఐదుగురిలో ఇద్దరు మాత్రమే దీనిని విశ్వసిస్తున్నారు.