
27 వేల కిలోమీటర్ల బంజరు భూమిలో ప్యానెళ్ల ఏర్పాటుకు చాన్స్
3వేలకు పైగా గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు: ఎన్‌ఐఎస్‌ఈ నివేదిక
న్యూఢిల్లీ: భారత్‌లో సౌర విద్యుదుత్పత్తికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్‌ఐఎస్‌ఈ) ఒక నివేదికలో పేర్కొంది. నిరుపయోగంగా ఉన్న 27,571 చ.కి.మీ. బంజరు భూముల్లో ప్యానెళ్లను ఏర్పాటు చేయడం (గ్రౌండ్ మౌంటెడ్ సోలార్) ద్వారా 3,343 జీడబ్ల్యూపీ మేర సోలార్ విద్యుదుత్పత్తి చేసే ఆస్కారం ఉంటుందని తెలిపింది. సముచిత స్థాయిలో సూర్యరశ్మి లభించినప్పుడు సౌర ప్యానెళ్లు గరిష్టంగా చేసే విద్యుదుత్పత్తిని జీడబ్ల్యూపీ (గిగావాట్స్ పీక్)గా వ్యవహరిస్తారు. 2014లో నిర్వహించిన అధ్యయనంలో 748.98 జీడబ్ల్యూపీ మేర గ్రౌండ్–మౌంటెడ్ సోలార్ పవర్‌కు అవకాశాలు ఉంటాయని అంచనా వేశారు.
సోలార్ ప్రోడక్టులపై పరిశోధనలు నిర్వహించడం, అభివృద్ధి చేయడం, పరికరాల టెస్టింగ్..సరి్టఫికేషన్ మొదలైన వాటి కోసం ఏర్పాటైన ఎన్‌ఐఎస్‌ఈ, కేంద్ర పునరుత్పాదక శక్తి శాఖలో భాగంగా ఉంది. కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న వివరాలను బట్టి చూస్తే ప్రస్తుతం అన్ని వనరుల స్థాపిత సామర్థ్యానికి ఎనిమిది రెట్లు అధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు అవకాశం కనిపిస్తోందని ఆయన చెప్పారు. దేశంలో పుష్కలంగా సౌర వనరులు ఉన్నాయని పేర్కొన్నారు.
చివరిసారిగా 2014లో అధ్యయనం నిర్వహించినప్పటి నుంచి సోలార్ పవర్ రంగంలో పరిస్థితులు చాలా మారిపోయాయని చెప్పారు. ఫొటోవొల్టెయిక్ సామర్థ్యాలు మెరుగుపడ్డాయని, వ్యయాలు గణనీయంగా తగ్గాయని మంత్రి చెప్పారు. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజయేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని నిర్దేశించుకోగా దేశీ పరిశ్రమ దన్నుతో ఇప్పటికే సగం లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్తుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్న అపోహలను ఈ నివేదిక తొలగిస్తుందన్నారు.
అత్యధికంగా రాజస్తాన్‌లో అవకాశం..
ఎన్‌ఐఎస్‌ఈ తాజా నివేదిక ప్రకారం, రాజస్తాన్, గుజరాత్‌లోని ఎడారి ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాల్లో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పీవీల ఏర్పాటుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. రాజస్తాన్‌లో అత్యధికంగా 828.78 జీడబ్ల్యూపీ, ఆ తర్వాత మహారాష్ట్రలో 486.68 జీడబ్ల్యూపీ, మధ్యప్రదేశ్‌లో 318.97 జీడబ్ల్యూపీ, ఆంధ్రప్రదేశ్‌లో 299.31 జీడబ్ల్యూపీ, గుజరాత్‌లో 243.22 జీడబ్ల్యూపీ మేర సౌర విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంది. సుమారు 4,12,458.37 చ.కి.మీ. మేర బంజరు భూమి ఉండగా, అందులో సుమారు 6.69 శాతం స్థాయిలో 27,571.39 చ.కి.మీ. భూమిని ఇందుకు ఉపయోగించుకోవచ్చని నివేదిక తెలిపింది. ఏ రాష్ట్రంలోనైనా నిరుపయోగ భూమిలో 10 శాతానికి మించి సోలార్ అవసరాల కోసం వినియోగించరాదన్న నిబంధనలకు అనుగుణంగా ఇది ఉంటుందని పేర్కొంది.
నివేదికలో మరిన్ని విశేషాలు..
∙ప్రాంతాలవారీగా చూస్తే దేశవ్యాప్తంగా మొత్తం గ్రౌండ్ మౌంటెడ్ సోలార్‌లో పశి్చమ రాష్ట్రాల వాటా 45 శాతంగా ఉండొచ్చు. పశి్చమ రాష్ట్రాల్లో అత్యధికంగా సూర్య రశ్మి సోకే, నిరుపయోగ భూమి చాలా ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, (299.31 జీడబ్ల్యూపీ), కర్ణాటక (223.28 జీడబ్ల్యూపీ), తమిళనాడు (204.77 జీడబ్ల్యూపీ), తెలంగాణ (140.45 జీడబ్ల్యూపీ సామర్థ్యం)లో కూడా ఒక మోస్తరు స్థాయిలో ఉన్న బంజరుభూములు ఉపయోగపడతాయి.
నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి ఈశాన్య, హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఎక్కువగా సూర్యరశ్మి లేకపోవడం, కఠినతరమైన పర్వత ప్రాంతాలు, అత్యధికంగా అడవులు, ఎక్కువగా బంజరు భూములు అందుబాటులో లేకపోవడం వంటి అంశాల వల్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్‌కు ఆస్కారం తక్కువగా ఉంటుంది.
∙సానుకూల పునరుత్పాదక విద్యుత్ పాలసీలు, పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఏడాది జనవరిలో భారత్‌లో స్థాపిత సోలార్ సామర్థ్యం 100 గిగావాట్ల పైకి చేరింది. 2014లో ఇది కేవలం 2.82 గిగావాట్లుగా ఉండేది.