
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ దేశ ఎగుమతులు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. 2024–25లో 825 బిలియన్ డాలర్లు విలువైన (రూ.70.12 లక్షల కోట్లు) వస్తు, సేవల ఎగుమతులు నమోదైనట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.778.13 బిలియన్ డాలర్లతో (రూ.66.14 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 6 శాతం వృద్ధి కనిపించింది.
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 820.93 బిలియన్ డాలర్లుగా ఏప్రిల్ 15న అంచనా వెల్లడించగా.. మార్చి నెలకు సంబంధించి సేవల ఎగుమతుల డేటాను ఆర్‌బీఐ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఎగుమతులను రూ.824.9 బిలియన్ డాలర్లకు సవరిస్తూ వాణిజ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో సేవల ఎగుమతులు 387.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023–24లో ఉన్న 341.1 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 13.6 శాతం పెరిగాయి. మార్చి నెలకు సేవల ఎగుమతులు 18.6 శాతం పెరిగి 35.6 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: వర్షాలతో సాగు సమృద్ధి
సేవల ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కీలక పాత్ర పోషించాయి. ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉన్నట్టు భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్‌సీ రల్హాన్ తెలిపారు. అయితే, వాణిజ్య ఒప్పందం కోసం యూఎస్ దిగుమతిదారులు వేచి చూస్తున్నందున ఇది మన ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చని చెప్పారు. ఎగుమతిదారులకు వడ్డీ రాయితీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో అధిక వడ్డీ రేట్లు ఉన్నాయని.. అంతర్జాతీయంగా పోటీ పడేందుకు వీలుగా కనీసం 5 శాతం మేర రాయితీ ఇవ్వాలని కోరారు.