రూ.1.2 లక్షల కోట్లకు ఆయుర్వేద మార్కెట్‌ | Sakshi
Sakshi News home page

రూ.1.2 లక్షల కోట్లకు ఆయుర్వేద మార్కెట్‌

Published Mon, Apr 8 2024 1:22 AM

India Ayurveda product market to reach Rs 1. 2 lakh crore by FY28 - Sakshi

2028 ఆర్థిక సంవత్సరం నాటికి అంచనాలు

టెక్‌ స్టార్టప్‌ నిరోగ్‌స్ట్రీట్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశీయంగా ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్‌ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రెట్టింపు స్థాయికి పైగా వృద్ధి చెందనుంది. ప్రస్తుతం 7 బిలియన్‌ డాలర్లుగా (దాదాపు రూ. 57,450 కోట్లు) ఉన్న ఈ మార్కెట్‌ 16.27 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) చేరనుంది. స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లలో సహజసిద్ధ చికిత్సా విధానాలకు డిమాండ్‌ నెలకొనడం, ఆయుర్వేద ప్రాక్టీషనర్లు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు కొత్తగా ఈ విభాగంలోకి ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా వస్తుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఆయుర్వేద టెక్‌ స్టార్టప్‌ సంస్థ నిరోగ్‌స్ట్రీట్‌ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

2023 – 2028 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్‌ ఏటా 15 శాతం చొప్పున పెరగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. నివేదిక ప్రకారం ప్రోడక్ట్‌ విభాగం 16 శాతం, సర్వీసుల విభాగం 12.4 శాతం చొప్పున వృద్ధి చెందనున్నాయి. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 7,500 పైచిలుకు ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థలు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, జమ్మూ–కశీ్మర్, కేరళ ఈ జాబితాలో ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఆయుష్‌ (ఆయుర్వేద, యోగ, యునానీ, సిద్ధ, హోమియోపతి) విభాగం 24 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందిందని ఆయుష్‌ శాఖ కార్యదర్శి రాజేష్‌ కోటేచా ఇటీవల ప్రస్తావించిన నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు భారత్‌ మార్కెట్లో గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని నిరోగ్‌స్ట్రీట్‌ తెలిపింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement