
నియామకాల్లో ప్రపంచంలో మనమే మేటి.. అత్యధిక ఏఐ నైపుణ్యాలతో రెండో స్థానం
3 టాప్ ఐటీ కంపెనీల్లో నియామకాల జోరు
పనిచేస్తున్న ఏఐ నిపుణులు 2.5 లక్షలకుపైనే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. నిపుణుల నియామకాల్లో తొలి స్థానంలో నిలిచి మన దేశం ప్రపంచం ఔరా అనిపించేలా చేసింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. అత్యధిక నైపుణ్యాలున్న దేశం అమెరికా కాగా, రెండో స్థానంలో భారత్ ఉంది. అంటే అగ్రరాజ్యంతో నువ్వా నేనా అన్నట్టు భారత్ పోటీపడుతోంది. పేటెంట్లు.. అందులో మళ్లీ ఏఐ పేటెంట్ల విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం.
ప్రపంచంలో అత్యధిక ఏఐ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఇంజనీర్లు ఉన్న దేశాల్లో యూఎస్ టాప్–1లో నిలిచింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. ఈ దేశంలోని ఐటీ ఇంజనీర్లలో సగటున 2.63 శాతం నైపుణ్యాలు ఉన్నాయి. మనదేశంలో ఇది 2.51 శాతంగా ఉంది. ఈ విషయంలో యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ మన కంటే వెనుకబడి ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఇంజనీర్లలో ఏఐ నిపుణుల వాటా 1 శాతమే. భారత్‌లో లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫామ్‌పై గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో 33.39 శాతం ఏఐ సంబంధ రోల్స్ ఉండడం విశేషం. ఈ స్థాయిలో ఏఐ రిక్రూట్‌మెంట్ జరగడంతో ప్రపంచంలోనే మనం టాప్‌లో నిలిచాం. ఏఐ పబ్లికేషన్ల విషయంలో కూడా 2013– 23 మధ్య 9.22 శాతం వాటాతో అమెరికా (America) కంటే మనమే ముందున్నాం. ఈ విషయంలో చైనా (China) 23.20 శాతంతో మొదటి స్థానంలో ఉంది.
చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!
పరిశోధకుల్లో వెనకడుగే..
అంతర్జాతీయంగా ఏఐ పరిశోధకుల్లో టాప్–2 శాతంలో మనవాళ్లు లేకపోవడం నిరాశపరుస్తోంది. ఈ విషయంలో యూఎస్, చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, మరో ముఖ్యమైన విషయం.. మన ఏఐ నిపుణులు (AI Experts) మనదేశం నుంచి తరలిపోవడం. గత ఏడాది లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫామ్‌పై.. భారత్‌లో సగటున ప్రతి 10,000 మంది ఏఐ నిపుణులకుగాను 1.55 మంది మన దేశం నుండి నిష్క్రమించారు. ఇలా అత్యధికులు వెళ్లిపోతున్న దేశంగా ఇజ్రాయెల్ తరువాత మనదేశం ఉందని ‘స్టాన్ ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక వెల్లడించింది.

పేటెంట్లలో చైనా జోరు..
ఏఐ పేటెంట్లలో కూడా మన దేశం వెనుకబడి ఉంది. 2024లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల్లో కేవలం 1.16 బిలియన్ డాలర్లను మాత్రమే భారత్ ఆకర్షించింది. యూఎస్ ఏకంగా 109.08 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. నిపుణులు, విస్తృతి పెరిగినప్పటికీ చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చాట్‌బాట్‌లు రూపొందించే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదు. ప్రతిభను అగ్రశ్రేణి పరిశోధన, పేటెంట్ పొందిన ఆవిష్కరణలు, బిలియన్ డాలర్ల ఏఐ ఉత్పత్తులను అందించేలా మలచడంలో పర్యావరణ వ్యవస్థ లేకపోవడం భారత్‌కు ప్రతికూలాంశంగా నిపుణులు చెబుతున్నారు.