
మూడేళ్లలో రూ.2.44 లక్షల కోట్లు
ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా అనంతరం ఇళ్ల స్థలాలకు గిరాకీ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా రూ.2.44 లక్షల కోట్ల విలువైన ప్లాట్లను గత మూడేళ్లలో ఆవిష్కరించినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. 2022 జనవరి నుంచి 2025 మే మధ్యకాలంలో దేశంలోని అగ్రగామి టాప్–1, 2 నగరాల్లో 4.7 లక్షల ఇళ్ల ప్లాట్లతో కూడిన ప్రాజెక్టులను డెవలపర్లు ప్రారంభించినట్టు వెల్లడించింది.
హైదరాబాద్, ఇందోర్, బెంగళూరు, చెన్నై, నాగ్‌పూర్, జైపూర్, కోయింబత్తూర్, మైసూరు, రాయిపూర్, సూరత్ నగరాల గణాంకాలతో ప్రాప్ ఈక్విటీ నివేదికను విడుదల చేసింది. అపార్ట్‌మెంట్లతో పోల్చినప్పుడు పెట్టుబడి విలువలో అధిక వృద్ధికి తోడు లిక్విడిటీ మెరుగ్గా ఉండడం (వేగంగా విక్రయించుకునే వెసులుబాటు)తో ఇళ్ల ప్లాట్లకు డిమాండ్ పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. తమకు నచి్చన విధంగా ఇంటిని నిర్మించుకోవాలన్న దృష్టితో కస్టమర్లు ప్లాట్లకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు.
తగ్గిన సరఫరా
ఒకవైపు ప్లాట్లకు డిమాండ్ నెలకొనగా, మరోవైపు 2024లో వీటి సరఫరా తగ్గడం గమనార్హం. ఈ 10 నగరాల్లో సరఫరా 2024లో 1,26,556 ప్లాట్లుగా ఉంది. 2023లో సరఫరా 1,63,529 ప్లాట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో (జనవరి–మే) 45,591 ఇళ్ల ప్లాట్లను డెవలపర్లు ప్రారంభించినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. ‘‘డెవలపర్లకు ప్లాట్లు వేగంగా అమ్ముడుపోతాయి. వేగంగా నగదు చేతికి అందుతుంది.
అపార్ట్‌మెంట్లతో పోల్చితే పెట్టుబడి అవసరం కూడా తక్కువే’’అని ఈ నివేదిక వివరించింది. పది నగరాల్లో చదరపు అడుగు ధర 2024లో రూ.3,679గా ఉంది. అంటే చదరపు గజం రూ.33,111గా ఉన్నట్టు. ఈ నివేదికపై స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎండీ అయిన కీర్తి చిలుకూరి స్పందిస్తూ.. దేవవ్యాప్తంగా ప్లాట్ల అభివృద్ధి పుంజుకోవడం అన్నది సొంతంగా ఇళ్లు కలిగి ఉండాలన్న ఆకాంక్ష పెరిగినట్టు సూచిస్తోందన్నారు.