
చదరపు అడుగు ధర రూ.7,412
టాప్–8 నగరాల్లో భిన్నమైన పరిస్థితి
ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి త్రైమాసింకంలో 5 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి రూ.7,053గా ఉంటే, 2025 మార్చి చివరికి రూ.7,412కు చేరుకుంది. ఎంఎంఆర్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణె, చెన్నై నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగగా.. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో ధరలు 4–5 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది.
ఇళ్ల ధరలు గత కొన్నేళ్ల నుంచి ఏటా పెరుగుతూ వచ్చాయని.. ఆ పెరుగుదల వేగం ఇటీవలి త్రైమాసికాల్లో నిదానించినట్టు తెలిపింది. 2022–24 మధ్య ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగిన అనంతరం.. మోస్తరు స్థాయికి చేరడంతో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తుందని పేర్కొంది.
టాప్–8 నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం తక్కువగా 98,095 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్ టైగర్ గత నెలలో విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. గత కొన్ని త్రైమాసికాలుగా ఇళ్ల ధరల పెరుగుదల మోస్తరుగా ఉండడం మార్కెట్ స్థిరపడినట్టు సంకేతమిస్తోందని హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. ధరలు తగ్గడం నిజమైన కొనుగోలుదారులకు ప్రేరణనిస్తుందని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడి అభిప్రాయపడ్డారు.
నగరాల వారీగా ధరలు..
→ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.12,600గా ఉంది.
→ ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లోనూ ఎలాంటి మార్పు లేకుండా రూ.8,106, చెన్నైలో 7,173, పుణెలో రూ.7,109 చొప్పున చదరపు అడుగు ధర మార్చి త్రైమాసికంలో ఉంది.
→ అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర డిసెంబర్ చివరికి రూ.4,402గా ఉంటే, మార్చి చివరికి రూ.4,568కి చేరింది.
→ బెంగళూరులో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.7,536 నుంచి రూ.7,881కి చేరింది.
→ కోల్‌కతాలో రూ.5,633 నుంచి రూ.5,839కి పెరిగింది.