హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా (Hotmail Co-Founder Sabeer Bhatia) భారత రియల్ ఎస్టేట్ రంగంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. 2012లో తాను భారతదేశంలో ఒక "అల్ట్రా లగ్జరీ" అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నప్పటికీ, 2032 నాటికి దాన్ని స్వాధీనం (పొజెషన్) చేస్తామని తాజాగా తెలియజేశారని ఆయన ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. అంటే, ఒక ఇంటి కోసం ఏకంగా 20 సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా గృహ కొనుగోలుదారుల సమస్యలపై మరోసారి చర్చకు తెరతీశాయి.
భాటియా తన తదుపరి పోస్టులో, "యువకుడిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఒక ప్రతిష్ఠాత్మక స్థావరం ఉండాలనే ఆశతో ఈ అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నాను. కానీ దాన్ని స్వాధీనం చేసుకునే సమయానికి నేను వృద్ధుడిని అవుతాను" అని వ్యాఖ్యానించారు. అయితే తన విమర్శలు ఏ ఒక్క ప్రభుత్వం లేదా వ్యక్తిపై కాదని, సమస్య మొత్తం వ్యవస్థలోనే ఉందని స్పష్టం చేశారు. "మంత్రులను మార్చడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. వ్యవస్థనే సరిదిద్దాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
మరో పోస్టులో "లోపభూయిష్టమైన వ్యవస్థను ప్రశంసించడం కంటే నిజం చెప్పడమే మంచిది" అని పేర్కొన్న భాటియా, ఈ అనుభవం భారత అభివృద్ధిపై తనకు అనేక సందేహాలను కలిగించిందని అన్నారు. అయితే అనంతరం మరో సందేశంలో భారత్‌పై తనకు ఇప్పటికీ విశ్వాసమే ఉందని, ప్రపంచంలోనే అత్యంత పెద్ద వినియోగ సామర్థ్యం ఉన్న దేశంగా భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నిజాయితీతో కూడిన వ్యవస్థ, సరైన దృక్పథం ఏర్పడితే ప్రపంచంలో నివసించడానికి అత్యుత్తమ 10 దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భాటియా పోస్టులకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలామంది గృహ కొనుగోలుదారులు నిర్మాణం పూర్తికాని ఇళ్లకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె భారం కూడా మోస్తున్నారని, భారత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాజెక్టుల ఆలస్యం ఇప్పటికీ పెద్ద సమస్యగానే ఉందని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం హాస్యంగా స్పందిస్తూ, "తాజ్‌మహల్ నిర్మించడానికి 22 సంవత్సరాలు పట్టింది... భారతీయ బిల్డర్లను తక్కువ అంచనా వేయొద్దు" అంటూ చమత్కరించారు.


