
TECH టమారం
జీవితంలో ఆనందం కావాలంటే, ఆరోగ్యం ఎంతో ముఖ్యం.
అలాంటి ఆరోగ్యం కోసం నిత్యం మీతోనే ఉంటూ
మీకు సలహాలు సూచనలు ఇచ్చే మినీ డాక్టర్స్
ఈ హెల్త్ హెల్ప్ గాడ్జెట్స్.
పిండేసిన శరీరాన్ని హీల్ చేస్తుంది
ఎంతో హుషారుగా కొత్తగా జిమ్ జాయిన్ అయితే, ఆ తర్వాతి రోజే వర్కౌట్స్ నొప్పులు, ‘ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేం’ అంటూ మిమ్మల్ని మొండికేస్తున్నాయా? అయితే, ఆ నొప్పుల పోరు తీర్చడానికి వచ్చింది ఈ ‘థెరాగన్ రిలీఫ్’. ఇది వర్కౌట్స్ చేయగా వచ్చే కండరాల నొప్పుల నివారణకు ఉపయోగపడే ఒక సరైన మసాజ్ థెరపీ. సాధారణ మసాజ్ గన్ కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని మూడు రకాల అటాచ్‌మెంట్లు శరీర భాగాలకు తగ్గట్టుగా ప్రొఫెషనల్ మసాజ్ చేస్తూ చాలా త్వరగా నొప్పిని పోగొడతాయి. ఒక్కసారి దీనిని వాడిన తర్వాత, శరీరం ‘ఇంకా చేద్దాం వర్కౌట్.. థెరాగన్ ఉందిగా’ అంటుంది. ధర 149 డాలర్లు (రూ. 12,725) మాత్రమే!

స్లీప్ అనలైజర్
వాచ్ వేసుకోమని బలవంతం చేయదు, రింగ్ పెట్టుకోమని అడగదు. కాని, మెల్లగా మీరు పడుకునే పరుపు కింద ఉండి, గుట్టుగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. చూడ్డానికి ఒక సాధారణ ప్యాడ్‌లాగా కనిపిస్తుంది. కాని, దీని పనితీరు చూస్తే ఎంతటివారైనా షాక్ తింటారు. ఎందుకంటే, మీ నిద్ర చరిత్ర అంతా ఒక్కసారికే చెప్పేయగలదు ఈ ‘వితింగ్స్ స్లీప్ అనలైజర్’. సాధారణ స్లీప్ ట్రాకర్ మాదిరి కాకుండా, నిద్ర ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది, మధ్యలో మీకు వచ్చే కలలు, వాటి వలన మీలో కలిగే మార్పులు, హార్ట్ బీట్, ఒత్తిడి, నిద్రలో మీరెలా ఫీల్ అవుతున్నారు, గురక పెడుతున్నారా, గురక శబ్దం ఎంత గట్టిగా ఉంటోంది– ఇలా నిద్రకు సంబంధించిన మరెన్నో విషయాలను విశ్లేషించి వివరాలను అందిస్తుంది. అవసరమైన సలహాలు, సూచనలను కూడా ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది నిద్ర ర హస్యాలను బయటపెట్టే ఒక జేమ్స్‌బాండ్. ధర 129 డాలర్లు (రూ. 11,011) మాత్రమే!

పోశ్చర్ ట్రైనర్
అందరికీ తెలిసిన రహస్యం, కుర్చీలో ఎలా పడితే అలా వంకరగా కూర్చొవడం కారణంగానే వెన్ను నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని. మరి, తెలిసిన విషయమే అయినా, సరిగ్గా కూర్చోలేకున్నారా? అయితే, ఇకపై ఎప్పుడైనా వంకరగా కూర్చుంటే వెంటనే మీ వీపు పై ‘టప్’మని కొట్టి, హెచ్చరిస్తుంది ఈ ‘పోశ్చర్ ట్రైనర్’. చిన్న లాకెట్ రూపంలో చైన్‌తో పాటు ఉంటుంది. దీనిని మెడకు ధరించి లాకెట్‌ను వీపుకు వేలాడదీసుకుంటే, చాలు ఎప్పటికప్పుడు మీ కూర్చునే పోశ్చర్‌ను వైబ్రేషన్స్‌తో సూచిస్తూ, కుర్చీలో మీరు ఒక రాజులా ఠీవిగా కూర్చునేలా చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ముప్పయి గంటలపాటు పనిచేస్తుంది. ధర రూ. 11,389.
