
భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఇటీవల సంతకం చేసిన నేపథ్యంలో పలువులు పారిశ్రామికవేత్తలు స్పందిస్తున్నారు. జొమాటో వ్యవస్థాపకులు, సీఈఓ దీపిందర్ గోయల్ సుంకాల వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం తన భవితవ్యంపై నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ శక్తులు ఇండియాను బెదిరిస్తూనే ఉంటాయన్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి శక్తిగా ఎదిగేందుకు భారత్ కృషి చేయాలని కోరారు. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడంపై భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో జీడీపీ, ఎగుమతులపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అందరూ ఏకం కావాలని పిలుపు
భారత్ సూపర్ పవర్‌గా ఎదగాలని దీపిందర్ గోయల్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఇండియా బలాన్ని పెంపొందించుకోకపోతే, ప్రపంచ శక్తులు బెదిరింపులకు పాల్పడుతాయని హెచ్చరించారు. దేశంలోని పౌరులు, వ్యాపారులు, విధాన నిర్ణేతలు భారత్‌ను ప్రపంచ స్థాయిలో టాప్‌లో ఉంచేందుకు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: భారత్‌కు ఎంత బాధైనా అది ఏడాదే?
ట్రంప్ ఇటీవలి కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో భారత దిగుమతులపై అదనంగా 25% సుంకాన్ని విధిస్తున్నట్లు చెప్పారు. దాంతో మొత్తం లెవీ 50 శాతానికి చేరింది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.