
భారత దిగుమతులపై అమెరికా 50 శాతానికి సుంకాలు పెంచడం ఇండియాపై మధ్య, దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. భారత్ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి, ఏడాదిపాటు వృద్ధిలో 50 బేసిస్ పాయింట్లు కోల్పోయే పరిస్థితులున్నాయని అభిప్రాయపడ్డారు. సుంకాలు అమలైతే జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 6.1 శాతానికి లేదా 6 శాతానికి పడిపోతుందని అంచనా వేశారు. ప్రస్తుతం భారత జీడీపీలో ఎగుమతుల వాటా 22 శాతం కాగా, వాటిలో అమెరికా వాటా 17 శాతంగా ఉంది.
ట్రంప్ సుంకాలతో ఏడాది పాటు జీడీపీ వృద్ధి గణాంకాలపై ప్రభావం పడినా, దీర్ఘకాలంలో అంటే ఏడాదికి మించి దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని సుబ్బారావు చెప్పారు. 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా సంపన్న దేశాల సరసన నిలవాలనే ఆకాంక్షలు ఉన్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దాన్ని చేరుకోవాలంటే తొలినాళ్లలో వృద్ధి ఎక్కువగా ఉండాలన్నారు. ఎందుకంటే తర్వాతి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వృద్ధి సాధించడం కష్టమవుతుందని చెప్పారు. ఏటా 50 బేసిస్ పాయింట్ల నష్టపోతే 2047 నాటికి వికసిత్ భారత్‌గా ఎదగాలనే దేశం లక్ష్యం నీరుగారుతుందన్నారు.
శ్రమ ఆధారిత రంగాలపై ప్రభావం
‘అమెరికా ప్రకటించిన లెవీలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై ప్రభావం చూపడమే కాకుండా, అల్ప ఆదాయ వర్గాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే అమెరికాకు ఎగుమతుల్లో ప్రధాన విభాగాలైన యంత్రాలు, రత్నాలు, ఆభరణాలు వంటి శ్రమ ఆధారిత రంగాలపై ప్రభావం పడనుంది. దీనికితోడు, భారతదేశం తన పెట్రోలియం అవసరాల కోసం రష్యాను కాదని పూర్తిగా సౌదీ అరేబియాపై ఆధారపడితే మొత్తం చమురు ఖర్చు పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణ రేటును, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం వల్ల డిమాండ్ తగ్గుతుందని, తద్వారా ప్రపంచ వృద్ధి రేటు కుంటుపడుతుందన్నారు. ఇది భారత్‌పై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అంచనా వేశారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా యూపీఐ సర్వీస్ డౌన్!
దృష్టి సారించాల్సినవి..
‘మన ఎగుమతులను ఇతర భౌగోళిక ప్రాంతాలకు విస్తరించడం, కొత్త ఎగుమతుల కోసం అన్వేషించడం, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అంశాలపై భారత్ మరింత దృష్టి సారించాలి. అమెరికాతో వాణిజ్యపరంగా ఏం జరిగినా వీటన్నిటినీ మనం అమలు చేయాలి’ అని సుబ్బారావు చెప్పారు.