డబ్ల్యూపీఐకి గుడ్‌బై.. పీపీఐకి మారనున్న కేంద్రం! | Government Plans Transition from WPI to PPI Within Five Years | Sakshi
Sakshi News home page

డబ్ల్యూపీఐకి గుడ్‌బై.. పీపీఐకి మారనున్న కేంద్రం!

Jun 16 2026 6:54 PM | Updated on Jun 16 2026 7:30 PM

Government Plans Transition from WPI to PPI Within Five Years

ధరల తీరును మరింత ప్రతిఫలించే విధంగా వస్తు, సేవలకు ఉత్పత్తిదారుల ధరల సూచీ (పీపీఐ)ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి నెలా విడుదల చేస్తున్న టోకు ధరల ఆధారిత సూచీ స్థానంలో వచ్చే ఐదేళ్లలోపు దీన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనుంది.

దేశవ్యాప్తంగా మే నెలకు అన్ని కమోడిటీలకు సంబంధించి అవుట్‌పుట్‌ పీపీఐ 109.6 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో ఇది 108.6 శాతంగా ఉంది. తయారీ రంగానికి సంబంధించి ప్రయోగాత్మక ఇన్‌పుట్‌ పీపీఐ మే నెలకు 104.9గా ఉంది. ప్రయోగాత్మక విధానంలో విడుదల చేస్తున్న ఈ డేటా నాణ్యతను పరిశీలించి, భాగస్వాముల అభిప్రాయాలను తెలుసుకుని అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం ఇదే విధానం అమల్లో ఉంది. దీంతో భారత్‌ సైతం డబ్ల్యూపీఐ నుంచి పీపీఐకి మారాలంటూ ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చాన్నాళ్లుగా కోరుతోంది. దీనికితోడు నీతిఆయోగ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఇటీవలే చేసిన సిఫారసుల మేరకు పీపీఐకి మారాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఉత్పత్తి తయారీ లేదా సేవను అందించేందుకు కంపెనీకి అయ్యే వ్యయాన్ని ఇన్‌పుట్‌ ప్రైస్‌ రూపంలో, తయారీ అనంతరం ఆయా సంస్థలు విక్రయించే ధరను అవుట్‌పుట్‌ ప్రైస్‌ రూపంలో డేటాను విడుదల చేయనున్నారు.

ఇన్‌పుట్‌ ధరలు పెరుగుతుంటే (కంపెనీలు వినియోగించే ముడి సరుకులు, విడిభాగాలు, మైక్రోచిప్‌లు తదితర), అంతిమంగా కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తుంటాయి. దాంతో రిటైల్‌ ధరలు పెరుగుతాయి. ఈ డేటాకు అనుగుణంగా ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. పీపీఐ అవుట్‌పుట్‌ ప్రైస్‌కు రవాణా, పన్నులు, వర్తకుల మార్జిన్‌లు కలసి రిటైల్‌ ధరలు నిర్ణయమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement