
ఆహార, తయారీ వస్తు రేట్ల పెరుగుదలతో ఆగస్ట్ నెలలో టోకు ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయిలో 0.52 శాతంగా నమోదైంది. గత రెండు నెలల పాటు నమోదైన క్షీణత (మైనస్) నుంచి బయటపడింది. జూలైలో మైనస్ 0.58 శాతం, జూన్‌లో మైనస్ 0.19 శాతం చొప్పున టోకు ద్రవ్యోల్బణం నమోదైంది. 2024 ఆగస్ట్ నెలలో ఇది 1.25 శాతంగా ఉంది. టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) వివరాలను పరిశ్రమల శాఖ విడుదల చేసింది. ఆహార, తయారీ వస్తువులు, నాన్ మెటాలిక్ మినరల్ ఉత్పత్తులు, రవాణా ఎక్విప్‌మెంట్ ధరలు పెరగడం వల్లే టోకు ద్రవ్యోల్బణం సానుకూల స్థితిలోకి వచ్చినట్లు తెలిపింది.
ఆహార విభాగంలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 3.06 శాతంగా నమోదైంది. జూలైలో ఇది మైనస్ 6.29 శాతంగా ఉంది.
కూరగాయల విభాగంలో మైనస్ 14.18 శాతంగా, పప్పుల్లో మైనస్ 14.85 శాతంగా ద్రవ్యోల్బణం ఉంది. జూలైలో ఇవి వరుసగా 28.96%, 15.12% చొప్పున ఉన్నాయి.
ఆలుగడ్డల విభాగంలో మైనస్ 44.11 శాతం, ఉల్లిగడ్డల విభాగంలో మైనస్ 50.46 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది.
విద్యుత్, ఇంధన విభాగంలో మైనస్ 3.17 శాతం ద్రవ్యోల్బణం నెలకొంది. జూలైలో ఇది మైనస్ 2.43 శాతంగా ఉంది.
తయారీ ఉత్పత్తుల విభాగంలో టోకు ద్రవ్యోల్బణం జూలైలో 2.05 శాతంగా ఉంటే, ఆగస్ట్‌లో 2.55 శాతానికి పెరిగింది.
ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా?