ఆర్‌బీఐ డీజీ పూనమ్ గుప్తా
ముంబై: సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఎలాంటి పాక్షిక దృష్టి ఉండదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ (డీజీ) పూనమ్ గుప్తా స్పష్టం చేశారు. ఎన్నో నమూనాలను అనుసరిస్తూ, నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం అంచనాలకు వస్తుందన్నారు. అయితే, అంచనాలు తప్పడం అన్నది అంతర్జాతీయంగా కనిపించే ధోరణేనన్నారు. బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ (భారత్ నుంచి విదేశాలకు నిధుల రాకపోకలు)కు సంబంధించి డేటాను ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తుండగా, ఇకపై నెలవారీ తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
అంతర్జాతీయంగా వాణిజ్య విధానాల్లో గణనీయమైన మార్పులను ప్రస్తావించారు. ద్రవ్యోల్బణంపై అతిగా వేసిన అంచనాలే గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐ రేట్లను మరింత తగ్గించకుండా నిరోధించిందన్న విమర్శలకు గుప్తా ఇలా స్పందించారు. ‘‘అంచనాల్లో లోపాలను పరిమితం చేయడం ఎంతో అవసరం. అయితే అంచనాలు వేసే విషయంలో ఎలాంటి పాక్షికత ఉండదు’’అని కేంద్ర గణాంకాలు ప్రణాళికల అమలు శాఖ నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా గుప్తా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనాలపై మీడియాలో వచి్చన విమర్శనాత్మక కథనాలను అంగీకరిస్తూ, అభిప్రాయాలను ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.


