టోకు ధరలకు కొత్త సూచీ | India will launch the Producer Price Index on June 15 | Sakshi
Sakshi News home page

టోకు ధరలకు కొత్త సూచీ

Jun 3 2026 4:27 AM | Updated on Jun 3 2026 4:27 AM

India will launch the Producer Price Index on June 15

జూన్‌ 15 నుంచి పీపీఐ సిరీస్‌     

ప్రస్తుత డబ్ల్యూపీఐ సిరీస్‌ అయిదేళ్లలో క్రమంగా తొలగింపు

న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ)ని కేంద్రం దశలవారీగా అయిదేళ్లలో తొలగించనుంది. దాని స్థానంలో క్రమంగా ఉత్పత్తిదారుల ధరల సూచీ (పీపీఐ)ని అమల్లోకి తేనుంది. ఎకానమీలో ద్రవ్యోల్బణం తీరుతెన్నులను వాస్తవికంగా తెలుసుకునేందుకు ఇది తోడ్పడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ ప్రవీణ్‌ మహతో తెలిపారు. ముడివస్తువులు, ఉత్పత్తి, సర్వీసులు మొదలైన వాటన్నింటినీ ఈ సూచీ పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రధానంగా ఔట్‌పుట్, ట్రయల్‌ ఇన్‌పుట్, సర్వీసెస్‌ పేరిట 3 సూచీలు ఉండే కొత్త పీపీఐ సిరీస్‌ని జూన్‌ 15 నుంచి ప్రవేశపెట్టనున్నారు.

అలాగే, ప్రస్తుతం అమల్లో ఉన్న డబ్ల్యూ పీఐ సిరీస్‌కి బేస్‌ ఇయర్‌ని 2011–12 నుంచి 2022–23కి సవరించి జూన్‌ 15 నుంచి గణాంకాలు విడుదల చేయనున్నారు. ఇందులో కొత్తగా సౌర విద్యుత్, అణు విద్యుత్‌లాంటివి జోడించడంతో పాటు క్రూడాయిల్‌ మొదలైన వాటి కేటగిరీల్లో మార్పులు చేశారు.  ఇక కొత్తగా ప్రవేశపెట్టే సర్వీసెస్‌ పీపీఐలో ప్రధానంగా ఏడు సేవలు (బ్యాంకింగ్, సెక్యూరిటీస్‌ లావాదేవీలు, బీమా, టెలికం, రైల్వేస్‌ మొదలైనవి) ఉంటాయి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న డబ్ల్యూపీఐ సిరీస్‌ గణాంకాలను సవరించి, పీపీఐతో పాటు విడుదల చేయనున్నట్లు మహతో తెలిపారు. ఆ తర్వాత డబ్ల్యూపీఐని నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement