
ఆహార ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు భారత ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్1, 2024 నుంచి మార్కి 31, 2025)లో మూడు మిలియన్ టన్నుల (ఎంటీ) గోధుమలను బహిరంగ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంది. ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ, మార్కెట్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఈ చర్యలను అమలు చేసినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇటీవల కాలం వరకు మిగులు గోధుమ నిల్వలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద 2024 ఆర్థిక సంవత్సరంలో బల్క్ కొనుగోలుదారులకు రికార్డు స్థాయిలో 10 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించడం విశేషం.
లభ్యత తగ్గుదల
2023-24 పంట సంవత్సరానికి భారతదేశ గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ఇది బలమైన సరఫరాను నిర్ధారిస్తుంది. అయితే మిగులు నిల్వలను మార్కెట్ డిమాండ్లతో సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం గతంలో సవాళ్లు ఎదుర్కొంది. కానీ ఇటీవల దేశీయ గోధుమల లభ్యత తగ్గిపోవడంతో దిగుమతులపై ఆధారపడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మూడు మూడు మెట్రిక్ టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవడం ద్వారా తక్కువ కాలంలో ధాన్యం లభ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వేలంలో తగ్గిన ధరలు
బల్క్ కొనుగోలుదారులు, ప్రాసెసర్లకు ధాన్యాన్ని విక్రయించడానికి ఇటీవల నిర్వహించిన వీక్లీ ఆక్షన్‌లో ఎఫ్‌సీఐ 0.49 మెట్రిక్ టన్నుల గోధుమలను విక్రయించింది. అంతకుముందు వారంకంటే క్వింటాలుకు కనీసం రూ.200 తక్కువకు అమ్ముడయ్యాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. కొత్త మార్కెటింగ్ సీజన్ (2025-26) కోసం మధ్యప్రదేశ్‌లో మార్చి 15న సేకరణ కార్యకలాపాలు ప్రారంభంకానున్నందున వీక్లీ ఇ-ఆక్షన్ కొనసాగే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ అధికారికంగా ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి రైతుల ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు గోధుమలను కొనుగోలు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని మండీలకు తాజా పంట రావడం ప్రారంభమైందని, ఇది సరఫరాను పెంచుతుందని తెలిపాయి.
బఫర్ కంటే అధికంగానే నిల్వలు
గతేడాది ఏప్రిల్ 1న ఎఫ్‌సీఐ వద్ద 7.46 మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉండగా, ఈసారి 13.55 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం గోధుమ నిల్వలు ఈ ఏడాది ఏప్రిల్ 1న 10-11 మెట్రిక్ టన్నుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది బఫర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2024-25 సీజన్‌లో కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.2425 కంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో క్వింటాలుకు రూ.125 బోనస్ ప్రకటించించారు. దాంతో రాబోయే రెండు వారాల్లో పంట రాబడి పుంజుకున్న తర్వాత మండీ ధరలు క్వింటాలుకు రూ.2600 వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.
ఈసారి సేకరణ ఇలా..
2025-26 రబీ మార్కెటింగ్ సీజన్ (ఏప్రిల్-జూన్)లో ఏజెన్సీల ద్వారా గోధుమల సేకరణ 31 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని ఆహార మంత్రిత్వ శాఖ గత వారం అంచనా వేసింది. ఇది 2024-25 మార్కెటింగ్ సీజన్‌లో వాస్తవ కొనుగోలు 26.6 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉంది. 2021-22 సీజన్‌లో రికార్డు స్థాయిలో 43.3 మెట్రిక్ టన్నుల సేకరణను సాధించిన తరువాత ఎంఎస్‌పీ, తక్కువ ఉత్పత్తి కారణంగా 2022-23 సీజన్‌లో రికార్డు స్థాయిలో 18.8 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అయితే 2023-24 సీజన్లో ఇది 40 శాతం పెరిగి 26.2 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.
ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..
2023-24 పంట సంవత్సరంలో గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసెసింగ్ పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రస్తుత పంట సంవత్సరంలో (2024-25) గోధుమ ఉత్పత్తి 110 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి (2024-25) ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.2,275 ఉంది.