కార్పొరేట్‌ కంపెనీల్లో మాజీ బ్యూరోక్రాట్లు | Former bureaucrats in corporate companies | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కంపెనీల్లో మాజీ బ్యూరోక్రాట్లు

Dec 22 2023 5:21 AM | Updated on Dec 22 2023 6:04 AM

Former bureaucrats in corporate companies - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ వర్గాల్లో పరపతి పెంచుకునే దిశగా కార్పొరేట్‌ కంపెనీలు మాజీ బ్యూరోక్రాట్లపై దృష్టి పెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వారిని తమ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించుకుంటున్నాయి. తాజాగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) మాజీ రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ను స్వతంత్ర డైరెక్టరుగా నియమించుకుంది. తద్వారా గత ఆరు నెలల వ్యవధిలో ఇలా ఒక మాజీ బ్యూరోక్రాట్‌ను నియమించుకున్న నిఫ్టీ 50 కంపెనీల్లో రెండోదిగాను, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో మూడోదిగాను నిలి్చంది.

నిఫ్టీ కంపెనీ అయిన లార్సన్‌ అండ్‌ టూబ్రో అక్టోబర్‌లో ఇలా ఒకరిని తీసుకోగా, హెచ్‌యూఎల్‌ పోటీ సంస్థలైన డాబర్, కోల్గేట్‌–పామోలివ్‌ కూడా అదే బాటలో నడిచాయి. హెచ్‌యూఎల్‌లో ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్‌ అయిన సంజీవ్‌ మిశ్రా, ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ ఓపీ భట్‌ స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. మాజీ బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ వర్గాలతో ఉండే సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని తమ పనులు జరిపించుకునే ఉద్దేశంతో కంపెనీలు ఇలా వారిని నియమించుకుంటూ ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అన్ని లిస్టెడ్‌ కంపెనీల్లో 6 శాతం..
తగినంత స్థాయిలో స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకోనందుకు గాను ప్రభుత్వ రంగ కంపెనీలకు ఒకవైపు అక్షింతలు పడుతుండగా.. మరోవైపు ప్రైవేట్‌ కంపెనీలు మాత్రం రిటైరైన బ్యూరోక్రాట్లను జోరుగా నియమించుకుంటున్నాయి. ప్రైమ్‌ డేటాబేస్‌ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అన్ని లిస్టెడ్‌ కంపెనీల్లోని స్వతంత్ర డైరెక్టర్లలో మాజీ బ్యూరోక్రాట్ల వాటా 6 శాతంగా ఉంది. అదే మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా టాప్‌ 200 కంపెనీలను మాత్రమే తీసుకుంటే ఇది మరింత అధికంగా 13 శాతంగా ఉంది. నిఫ్టీ 50లో 26 పైచిలుకు సంస్థలు రిటైరైన బ్యూరోక్రాట్లను నియమించుకున్నాయి.

ఐటీసీ, మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్, భారతి ఎయిర్‌టెల్, హిందాల్కో, హెచ్‌యూఎల్‌ మొదలైన సంస్థల్లో అత్యధిక సంఖ్యలో మాజీ బ్యూరోక్రాట్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. వ్యక్తులవారీగా చూస్తే ఏఎన్‌ రాయ్‌ 7 సంస్థల్లో స్వతంత్ర డైరెక్టరుగా ఉండగా అమిత్‌ కిరణ్‌ దేవ్‌ (6 సంస్థల్లో), దీపా గోపాలన్‌ వాధ్వా.. దినేష్‌ కుమార్‌ మిట్టల్‌.. యూకే సిన్హా ..సుమిత్‌ బోస్‌ .. వీరయ్య చౌదరి కొసరాజు తలో అయిదు సంస్థల్లో, సుధా పిళ్లయ్‌ .. మీరా శంకర్‌ .. నిరుపమా రావు తలో 4 సంస్థల్లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా ఉన్నారు.  

ఇక, అత్యధికంగా మాజీ బ్యూరోక్రాట్లు ఉన్న ప్రభుత్వ రంగయేతర సంస్థలను చూస్తే డాబర్‌ ఇండియాలో ఆరుగురు ఉన్నారు. ఐటీసీ, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్, అపోలో టైర్స్, సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ (ఇండియా)లో నలుగురు చొప్పున .. సెంచరీ ప్లైబోర్డ్స్‌ (ఐ), వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్, లార్సన్‌ అండ్‌ టూబ్రో, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ముగ్గురు చొప్పున ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement