
ఉన్నపళంగా వెనక్కివచ్చేయాలన్న కార్పొరేట్ సంస్థలు
నేరుగా అమెరికాకు వెళ్లే విమానాలకు అమాంతం పెరిగిన బుకింగ్స్
ఆఖరి నిమిషంలో అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ఆగిపోయిన మరికొందరు
న్యూఢిల్లీ/ముంబై: హెచ్–1బీ వార్షిక ఫీజు లక్ష డాల ర్లకు పెంచడంతోపాటు తాము పనిచేస్తున్న కార్పొరే ట్ సంస్థల యాజమాన్యాల నుంచి వచ్చిన సందేశాలతో భారతీయ హెచ్–1బీ వీసాదారుల గుండె రైళ్లు పరుగెడుతున్నాయి. 21వ తేదీ నుంచి నిర్ణ యం అమలుచేస్తానని ట్రంప్ ప్రకటించడంతో ఆతేదీనాటికి హెచ్–1బీ వీసాదారులంతా అమెరికా గడ్డమీదనే ఉండిపోవాలేమోనని కార్పొరేట్ కంపెనీలు భావించాయి.
సొంత పనుల స్వదేశాలకు వెళ్లిన తమ ఉద్యోగులను తక్షణం అమెరికాకు వచ్చేయాలని మెమోలు పంపాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీమోర్గాన్ వంటి కీలక సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ఇలాంటి సందేశాలు చేరవేశాయి. దీంతో శరన్నవరాత్రులు, దసరా కోసం భారత్‌కు వచ్చిన హెచ్–1బీ వీసాదారులు ఉన్నపళాన ఎయిర్‌పోర్ట్‌లకు పరుగెత్తారు.
నేరుగా అమెరికా ప్రయాణానికి విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీన్ని పౌరవిమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుని ధరలను అమాంతం పెంచేశాయి. న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విమాన టికెట్ ధరను అదనంగా రూ.37వేల నుంచి రూ.80 వేలదాకా పెంచేశారు. పెరిగిన ధరలతో ఒక టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 4,500 డాలర్లు అంటే దాదాపు రూ. 3,96,000కు చేరుకుందని ఒక యూజర్ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు.
విమానాల నుంచి బయటకు పరుగోపరుగు
భారత్‌లో కుటుంబసమేతంగా పండుగలు జరుపుకునేందుకు న్యూయార్క్, ఇతరత్రా అమెరికా విమానాశ్రయాల్లో విమానం ఎక్కిన హెచ్–1బీవీసాదారులు ట్రంప్ ప్రకటన వార్త తెల్సిన మరుక్షణమే వెంటనే విమానాల నుంచి బయటకు దిగిపోయారు. రన్‌వేపై ఉన్న విమానం నుంచి సైతం హఠాత్తుగా భారతీయులు గగ్గోలుపెట్టిమరీ విమానాన్ని ఆపించేసి కిందకు దిగిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారాయి.
‘‘శుక్రవారం ఉదయం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్‌కు వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా విమానం ఎక్కేశారు. ఇంకొన్ని సెకన్లలో విమానం బయల్దేరుతుందనగా కొందరు లేచి గోల చేశారు. మేం విమానం దిగిపోతాం అని అరుపులు మొదలెట్టారు. అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా మంది విమానం తలుపు దగ్గర గుమిగూడారు. వీళ్లంతా దిగిపోయి అంత సద్దుమణగడానికి మూడు గంటలు సమయం పట్టింది’’అని విమానప్రయాణికుడు మసూద్ రాణా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు.
‘‘శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. బోర్డింగ్ పాస్‌లు ఇచ్చే ప్రాంతంలో, బేఏరియాలోనూ హెచ్–1బీ వీసాదారులు తమ భారత ప్రయాణాలను రద్దుచేసుకుని వేగంగా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు పరుగెత్తడం చూశా’’అని చార్టర్డ్ అకౌంటెంట్ కౌస్తవ్ మజూందార్ అనే మరో యూజర్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘దుబాయ్ విమానాశ్రయంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అమెరికా నుంచి దుబాయ్‌కు చేరుకున్న వీసాదారులు ముంబైకి వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్నారు.
ట్రంప్ వార్త వినగానే భారత్‌కు వెళ్లడాన్ని విరమించుకుని అదే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నేరుగా అమెరికా టికెట్ల కోసం కౌంటర్ వద్ద క్యూ కట్టారు’’అని మరో యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. భారతీయులు ఇంతచేసినా ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌ను చేరుకోవడం కష్టమేనని తెలుస్తోంది. ఈ వార్త తెలిసేటప్పటికి భారత్‌లో ఉన్న వీసాదారులకు కేవలం 10 గంటల సమయమే మిగిలిఉంది. అప్పటికప్పుడు ఢిల్లీ లేదా ముంబై నుంచి డైరెక్ట్ ఫ్లయిట్‌లో బయల్దేరినా అమెరికాకు చేరుకోవడానికి 15 గంటలకుపైనే సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.