
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఊహకందని సమస్యలను తీసుకొస్తుందని 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) హెచ్చరికలు జారీ చేసిన తరువాత.. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ 'మో గౌడత్' (Mo Gawdat) కూడా అదే తరహాలో పేర్కొన్నారు.
కృత్రిమ మేధ కారణంగా 2027 నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని, సమాజానికి పెద్ద సమస్యగా తయారవుతుందని మో గౌడత్ పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, సీఈఓలు, పాడ్‌కాస్టర్‌లతో సహా ఎవరూ ఏఐ నుంచి తప్పించుకోలేరని అన్నారు. అంతే కాకుండా రాబోయే 15 సంవత్సరాలు ఉద్యోగులకు నరకం అని సంబోధించారు.
గూగుల్ సంస్థలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన గౌడత్.. ప్రస్తుతం ఎమ్మా.లవ్ అనే స్టార్టప్ నడుపుతున్నారు. ఇందులో కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఆ స్టార్టప్‌లో 350 మంది డెవలపర్లు ఉండేవారు. కానీ ఏఐ కారణంగా ప్రస్తుతం దీన్ని ముగ్గురే నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి ఏఐ ఎంతగా విస్తృతిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఏఐ ఆవిర్భావం 'సామాజిక అశాంతిని' రేకెత్తిస్తుందని. ప్రజలు ఇప్పటికే తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. దీని ఫలితంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడం, ఒంటరితనం పెరగడం, సామాజిక విభజనలు తీవ్రమవుతాయని గౌడత్ అన్నారు. ఏఐని సరిగ్గా నియంత్రించకపోతే భారీ అసమానతలను సృష్టిస్తుంది. ధనవంతులు మాత్రమే మనగలుగుతారు. మిగతా వారందరూ కష్టపడతారని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఉద్యోగం మానేసి నా స్టోర్‌లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..
ఏఐ సొంత భాష
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ.. ఏఐ సొంత భాషను ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు. యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేమని అన్నారు.