
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనిషి ప్రయత్నిస్తే సాధించలేని ఏదీ లేదు. ఒకప్పడు ఏడాదికి రూ.2.19 లక్షల జీతం అందుకునే వ్యక్తి.. తొమ్మిదేళ్లలో సంవత్సరానికి ఏకంగా రూ. 92.5 లక్షల వేతనం తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది?, దాని వెనుకున్న అతని కృషి ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
2016లో మాస్ హైరింగ్ ద్వారా మొదటి ఉద్యోగం పొందాను. నా జీతం రూ.2.16 లక్షలు. అప్పుడు జావాలో ట్రైనింగ్ తీసుకున్న సమయంలో.. నా కజిన్ ఒకరు నా స్టోర్‌లో సేల్స్‌పర్సన్‌గా పని పనిచేస్తే.. అంతకంటే ఎక్కువ జీతం ఇస్తాను అన్నాడు. ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.ఆ సమయంలో నేను నిజంగా సిగ్గుపడ్డాను. అయితే 2017లో నా వేతనం రూ. 3.35 లక్షలకు చేరింది. ఆ తరువాత ఇంకో కంపెనీలో రూ.6.6 లక్షల ప్యాకేజీకి చేరాను. అంతటితో నా ప్రయాణం ఆపలేదు.
2018లో ఇంకొన్ని కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. అప్పుడు రూ.7.3 లక్షల వేతనానికి ఉద్యోగంలో చేరాను. అదే సంస్థ 2019లో నా ప్యాకేజీని రూ.9.75 లక్షలు చేసింది. వేతనం పెరగడం, ఉద్యోగంలో సుఖంగా ఉండటం చేత.. ఇంటర్వ్యూలకు హాజరవ్వడం మానేశాను. 2020లో నా జీతం రూ. 12.5 లక్షలకు చేరింది. కోవిడ్ రావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైంది. కంపెనీ బాగానే ఉన్నప్పటికీ.. బోనస్‌లు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వకుండా కోవిడ్‌ను సాకు చెప్పారు. ఆ సమయంలోనే మళ్ళీ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని అనుకున్నాను.
2020లోనే మరో ఇంటర్వ్యూకు హాజరైతే.. రూ.25 లక్షల ప్యాకేజ్ లభించింది. కొత్త కంపెనీ, ఎక్కువ పని. అయినా చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆ తరువాత 2021, 2022, 2023, 2024లలో కూడా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను, జీతం కూడా పెరిగింది. 2025లో ఓ ఇంటర్వ్యూకు వెళ్తే అక్కడ రూ. 92.5 లక్షల ప్యాకేజ్ లభించింది. దీంతో ఈ ఏడాది చాలా ఆనందంగా గడుస్తోంది. ఇప్పుడు వస్తున్న జీతం.. ప్రారంభంలో నా నెల జీతంకంటే చాలా ఎక్కువ. ఇప్పుడు నన్ను ఎగతాళి చేసిన నా కజిన్.. తన పిల్లలకు నాలాగే ఉండాలని చెబుతున్నాడు.
ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగి
రూ.2.19 లక్షల వేతనం తీసుకునే స్థాయి నుంచి రూ.92.5 లక్షల వేతనం తీసుకునే స్థాయికి ఒక్క రోజులో చేరుకోలేదు. ఎంతో కష్టపడ్డాను. అయితే సరైన సమయంలో సరైన స్థలంలో ఉండటం నా అదృష్టమని నమ్ముతున్నానని పేర్కొన్నాడు. అతని ఎదుగుదలను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుంటే.. మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.