ఏఐ వినియోగం ఇప్పుడు అన్ని రంగాలకూ విస్తరించింది. మొన్నటి వరకూ ఫోను లేకుంటే ఏ పనీ జరగదనేవారు.. ఇప్పుడు ఏఐ సాయం లేకపోతే అంతా శూన్యమే అంటున్నారు. ఏఐ వినియోగించకపోవడంతో ఇంటర్య్యూలో ఫెయిలయిన ఒక యువకుని ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ వస్తే సరిపోదని, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం ఇప్పుడు తప్పనిసరి అని ఆకాష్ విశాల్ హజారికాకు ఎదురైన అనుభవం స్పష్టం చేస్తోంది.
గూగుల్, అమెజాన్, స్ప్లంక్, సేల్స్‌ఫోర్స్ తదితర దిగ్గజ సంస్థలలో ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీర్ ఆకాష్ విశాల్ ప్రస్తుత టెక్ ప్రపంచంలో చోటుచేసుకున్న మార్పులను వివరించారు. ఏఐ అనేది ఇప్పుడు ఒక ఐచ్ఛికం కాదని, డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయడానికి, కోడింగ్ పనులను తగ్గించడానికి, నాణ్యతను పెంచడానికి ఇంజనీర్లు ఏఐని వాడాలని కంపెనీలు ఆశిస్తున్నాయని ఆయన వివరించారు.
ఈ నూతన మార్పుల కారణంగా ఇంజనీర్లు సిస్టమ్ డిజైన్, క్లిష్టమైన బిజినెస్ లాజిక్‌పై అధికంగా దృష్టి పెట్టగలుగుతారని ఆయన తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు సన్నద్ధమవడం అనేది ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని ఆయన ‘ఎన్‌డీటీవీ’తో అన్నారు. 2020లో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, సిస్టమ్ డిజైన్‌లో పట్టు ఉంటే అభ్యర్థులు సులభంగా ఉద్యోగాలు సాధించేవారు. కానీ నేడు ఆ నైపుణ్యాలను కేవలం కనీస అర్హతగా మాత్రమే పరిగణిస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లౌడ్ నైపుణ్యాలతో పాటు, ‘ప్రాంప్ట్ ఇంజనీరింగ్’ ఏఐ సహాయంతో డీబగ్గింగ్ చేయడం వంటి కొత్త నైపుణ్యాలు అత్యవసరంగా మారాయని ఆకాష్ విశాల్ తెలిపారు.
ఏ పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతులు వాడాలి? ఎప్పుడు ఏఐని సిస్టమ్స్‌తో అనుసంధానించాలి అనే అవగాహన ఉన్న అభ్యర్థులకే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇంటర్వ్యూల తీరులో కూడా భారీ మార్పులు వచ్చాయంటూ, ఆయన తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. సిలికాన్ వ్యాలీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ 2024లో నిర్వహించిన ఇంటర్వ్యూలో, ఒక పెద్ద కోడ్‌బేస్‌ను డీబగ్ చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో ఏఐ టూల్స్ వాడుకోవచ్చని కంపెనీ సూచన చేసింది. అయితే ఆయన సొంత నైపుణ్యంతోనే చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఏఐని ఉపయోగించుకోకపోవడం కారణంగానే తాను ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని, అది తనకు ఒక మేల్కొలుపులా మారిందని అని ఆయన తెలిపారు.
ఇప్పుడు చాలా కంపెనీలు లైవ్ కోడింగ్ సెషన్లలో అభ్యర్థులు ఏఐని ఎంత సమర్థవంతంగా వాడుతున్నారో కూడా గమనిస్తున్నాయని ఆకాష్ విశాల్ తెలిపారు. ప్రస్తుతం సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూలలో ఏఐ ఇంటిగ్రేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, మోడల్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌పై ప్రశ్నలు అడుగుతున్నారని తెలిపారు. కేవలం సాంకేతిక నైపుణ్యాలే కాకుండా, ఏఐని ఎంత బాధ్యతాయుతంగా వాడుతున్నారో, ఆటోమేషన్, మానవ పర్యవేక్షణ మధ్య సమతుల్యతను ఎలా పాటిస్తున్నారో కూడా బిహేవియరల్ ఇంటర్వ్యూలలో పరీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘పైలట్లపైకి తోసేస్తారా?’.. అమెరికా సంస్థ ఆగ్రహం


