ఐటీ జాబ్స్ తెచ్చుకోవడం చాలామంది కల. అయితే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక బిక్కుబిక్కు మంటున్న పరిస్థితి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. జీతాలు చెల్లించడంలో కూడా ఆలస్యమవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి నిదర్శనమే పూణేలో జరిగిన ఈ ఘటన. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
పూణేలోని టీసీఎస్ ఉద్యోగి జీతం అందడంలో జాప్యం కారణంగా.. కంపెనీ సహ్యాద్రి పార్క్ కార్యాలయం వెలుపల పడుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీతం రాకపోవడంతో.. ఫుడ్ కోసం కూడా తన వద్ద డబ్బు లేకుండా పోయిందని ఉద్యోగి పేర్కొన్నాడు. దీనికి నిరసనగానే ఆఫీస్ బయట ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఒక లేఖ కూడా రాశాడు.
తన ఆర్ధిక పరిస్థితి గురించి 'హెచ్ఆర్'కు తెలియజేసినట్లు, జీతం రాకుంటే బయట పాడుకోవాల్సి వస్తుందని హెచ్చరించినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. ఆ ఉద్యోగి ఫుట్‌పాత్‌పై పడుకున్న దృశ్యాలు, తన పరిస్థితి గురించి వెల్లడించిన లేఖ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. కంపెనీ తీరుపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు ఆ ఉద్యోగిపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరిక
చాలామంది నెటిజన్లు కంపెనీ ఉద్యోగి పట్ల మౌనం వహించడాన్ని విమర్శించారు. కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. మరికొందరు టెక్ పరిశ్రమలో జీతాల ఆలస్యానికి సంబంధించిన సమస్యలను హైలైట్ చేశారు.
A TCS employee is apparently protesting by sleeping outside the Pune office because his salary has not been credited.
😢 pic.twitter.com/MV4rPRa4P7— Jaydeep (@_jaydeepkarale) August 3, 2025
టీసీఎస్ ఏమన్నదంటే..
సదరు ఉద్యోగి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడని, అందుకే కంపెనీ నియమావళి ప్రకారం ఆ గైర్హాజరైన కాలానికి వేతనం నిలుపుదల చేయడం జరిగిందని టీసీఎస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ప్రస్తుతం ఆ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరాడని, అతనికి వసతి కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
