
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమోదం తెలిపిన సెమీకండక్టర్ పరిశ్రమల ద్వారా ఏటా 24 బిలియన్ చిప్‌లు దేశీయంగా తయారు కానున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్ శాఖ అదనపు సెక్రటరీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ సీఈవో అమితేష్ సిన్హా ప్రకటించారు.
ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ఒక వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ సహా మొత్తం ఆరు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ''ఈ ఫ్యాబ్ నెలకు 50,000 వేఫర్లను తయారు చేస్తుంది. మిగిలిన ఐదు ప్యాకేజింగ్ యూనిట్లు 24 బిలియన్ చిప్స్‌ను ఏటా ఉత్పత్తి చేస్తాయి. మరిన్ని ప్రతిపాదనలను మదింపు దశలో ఉన్నాయి. కనుక సమీప కాలంలో మరిన్ని ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వనున్నాం''అని సిన్హా తెలిపారు.
విధానాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని భరోసానిస్తూ.. సెమీకండక్టర్ రంగంలో భారత్ దీర్ఘకాల మార్కెట్‌గా కొనసాగుతుందన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా కేంద్రం రూ.76,000 కోట్లతో పథకాన్ని ప్రకటించడం తెలిసే ఉంటుంది. సరఫరా వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయమైన భాగస్వామిగా పేర్కొన్నారు.